(Source: ECI/ABP News/ABP Majha)
CM Chandrababu: శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు - కృష్ణమ్మకు జలహారతి, సుప్రీం తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి
Andhrapradesh News: ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం మల్లన్న సేవలో గురువారం పాల్గొన్నారు. అనంతరం కృష్ణానదికి జలహారతి ఇచ్చారు. సత్యసాయి జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
CM Chandrababu Visited Srisailam Mallanna Temple: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) శ్రీశైలం మల్లన్న సేవలో గురువారం పాల్గొన్నారు. నంద్యాల, సత్యసాయి జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత ఆయన శ్రీశైలం చేరుకున్నారు. ఉదయం హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్న ఆయనకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లన్న ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్న, భ్రమరాంభ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎంకు వేద ఆశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని చంద్రబాబుకు అందజేశారు.
కృష్ణమ్మకు జలహారతి
ప్రాణికోటి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులని దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనది. నిండుకుండలా ఉన్న శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మకు జలహారతిని ఇవ్వడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు రైతుల కళ్ళలో ఆనందం నింపుతున్నాయి. ఇది రాష్ట్రానికి శుభసూచకం.… pic.twitter.com/hFeIRQK5c4
— N Chandrababu Naidu (@ncbn) August 1, 2024
శ్రీశైల మల్లన్న సేవలో పాల్గొన్న అనంతరం సీఎం కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. అనంతరం శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత నీటి పారుదల శాఖ అధికారులతో భేటీ అవుతారు. శ్రీశైలం పర్యటన ముగిసిన తర్వాత సత్యసాయి జిల్లా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లబ్ధిదారులకు పింఛన్ అందిస్తారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు.
సుప్రీం తీర్పును స్వాగతించిన సీఎం
అటు, ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం పర్యటనలో ఉన్న ఆయన.. సున్నిపెంటలో నిర్వహించిన సభలో మాట్లాడారు. సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడమే టీడీపీ సిద్ధాంతమని అన్నారు. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా తీసుకొచ్చామని.. అందరికీ న్యాయం జరగాలని చెప్పారు. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలానే చేశామని స్ఫష్టం చేశారు. గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులను పట్టించుకోలేదన్న ఆయన.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని.. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచుతామని తద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలందరిదీ అని.. ప్రజల వాడిగా ఉంటా అని సీఎం పేర్కొన్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద
శ్రీశైలం పర్యటనలో భాగంగా కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. మరోవైపు, ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ క్రమంలో అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేశుల నుంచి 3,42,026 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. స్పిల్‌వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 884.50 అడుగులుగా నీటిమట్టం ఉంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలుగా ఉంది.
అటు, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 60 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.