100 Crore Reward: క్వాంటం టెక్నాలజీలో అద్భుతాలు చేసిన వారికి రూ.100 కోట్లు - సీఎం చంద్రబాబు ప్రకటన
క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు క్వాంటం ప్రోగ్రామ్‌లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్ధులకు వివరించారు.

ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్లు ఇస్తామని ప్రకటించాం, క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వంద కోట్లు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 'క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తన సుదీర్ఘ అనుభవాన్ని, భవిష్యత్ విజన్‌ను రంగరించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఐటీ నుంచి క్వాంటం వరకు ఏపీ ప్రస్థానం
ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో 25 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ విజన్ ద్వారా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తుచేసుకున్నారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చిన అనుభవంతో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం విప్లవానికి కేంద్రబిందువుగా మార్చబోతున్నట్లు తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, అమరావతిని భారత 'క్వాంటం వ్యాలీ'గా అభివృద్ధి చేస్తామన్నారు. భారతీయుల డీఎన్ఏలోనే విజ్ఞానం ఉందని, ప్రాచీన కాలం నుండి గణితం, ఖగోళ శాస్త్రం మరియు నగర ప్రణాళికలో మన నైపుణ్యాన్ని నిరూపించుకున్నామని పేర్కొన్నారు.
ఆర్థిక వృద్ధి, యువతకు ఉపాధి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులేనని, వారిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారని సీఎం గర్వంగా ప్రకటించారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి దిగ్గజాలు గ్లోబల్ కంపెనీలను నడిపిస్తున్నారని, రాబోయే రోజుల్లో క్వాంటం రంగంలోనూ ఏపీ యువత అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ 'వికసిత్ భారత్' లక్ష్యంతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా, తిరుపతిని స్పేస్ సిటీగా, అనంతపురం-కడప ప్రాంతాలను ఏరోస్పేస్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.
లక్ష మంది క్వాంటం నిపుణుల తయారీ
క్వాంటం రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు ప్రభుత్వం 'స్కిల్ రోడ్ మ్యాప్' సిద్ధం చేసింది. నవంబర్ 13న ఇచ్చిన ఒక్క ప్రకటనతోనే 54 వేల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వైద్యం, సుస్థిర వ్యవసాయం, వాతావరణ అంచనా మరియు రక్షణ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ అద్భుతమైన మార్పులను తీసుకువస్తుందని, ఈ సాంకేతికత ద్వారా ప్రజలకు తక్కువ వ్యయంతో మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు.
నోబెల్ బహుమతికి 100 కోట్ల ప్రోత్సాహకం
గతంలో ప్రకటించిన విధంగానే, ఏపీ నుంచి ఎవరైనా క్వాంటం టెక్నాలజీ లేదా ఇతర రంగాల్లో నోబెల్ బహుమతి సాధిస్తే వారికి ప్రభుత్వం తరపున వంద కోట్ల రూపాయల బహుమతిని అందజేస్తామని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. అమరావతిలో కేవలం పరిశోధనలే కాకుండా, వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తిని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ 'ఫస్ట్ మూవర్'గా ఉంటుందని, ఎవరినీ అనుసరించబోదని ధీమా వ్యక్తం చేశారు.






















