CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
Andhrapradesh News: ఏపీ సీఎంచంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో గురువారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, విభజన సమస్యల పరిష్కారంపై ఆయనతో విస్తృతంగా చర్చించారు.
CM Chandrababu Meet With PM Modi: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) గురువారం ప్రధాని మోదీతో (PM Modi) భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారు. విభజన హామీల అమలుతో పాటు పోలవరం నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరుపై చర్చించారు. అలాగే, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు, పారిశ్రామిక రంగాలకు రాయితీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన చంద్రబాబు.. వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం కానున్నారు. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురీతో భేటీ అవుతారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మెహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్ నీరభ్ కుమార్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
ఈ నెల 5న..
సీఎం చంద్రబాబు ఈ నెల 5న (శుక్రవారం) ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం, ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉదయం 10:45 గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ అవుతారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు జపాన్ రాయబారితో సీఎం భేటీ అవుతారు. సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
తెలంగాణ సీఎం సైతం..
అటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను సైతం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు సహా విభజన హామీల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నెల 6న ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ సందర్భంగా విభజన హామీలు, పెండింగ్ అంశాలు చర్చించనున్న క్రమంలో ఈ అంశాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ నియామకం సహా, మంత్రివర్గ విస్తరణపైనా ఇరువురు నేతలూ విస్తృతంగా కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Also Read: Pawan Kalyan: పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్- అక్కడే బైక్ రేస్‌లు చేస్కోండని కామెంట్స్