Pawan Kalyan: పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్- అక్కడే బైక్ రేస్‌లు చేస్కోండని కామెంట్స్
Janasena News: ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అనే ట్రెండ్‌పై పవన్ కల్యాణ్ స్పందించారు. యువత ఆ నెంబరు ప్లేట్లతో తిరుగుతున్నారని పోలీసులకు దొరికితే తనమీదికి వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Land In Pithapuram: ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల నుంచి యువత ఎక్కువగా ఓ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. బైక్‌లపై నంబర్ ప్లేటుకు బదులు ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అంటూ రాయించుకొని తిరుగుతున్నారు. పవన్ కల్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకునేందుకు యువత పోటీ పడి మరీ తమ నెంబర్ ప్లేట్లు తీయించుకొని మరీ.. జనసేన ముద్రతో ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అని తమ బైకలపై ఫిక్స్ చేయించుకున్నారు.
ఈ ధోరణిపై తాజాగా పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. బుధవారం (జూలై 3) వారాహి సభ నిర్వహించారు. అందులో దీని గురించి మాట్లాడుతూ.. ఎవరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని నంబర్ ప్లే్ట్లు పెట్టుకోవద్దని కోరారు. వాహనానికి ఒరిజినల్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని.. అప్పుడు అది తనమీదికి వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ ప్లేట్స్‌తో వన్ వేలో వెళ్లి పోలీసులకు దొరికితే.. అప్పుడు పోలీసులు తనను పట్టుకుంటారని అన్నారు.
కాబట్టి, యువత ఎవరైనా బైక్ రేసింగ్‌లు చేసుకోవాలనుకునే వారు తన రెండెకరాల స్థలంలో చేసుకోవచ్చని సూచించారు. కావాలంటే తన స్థలాన్ని రేసింగ్ లకు అనుకూలంగా మార్చుతానని చెప్పారు. అందరికి హెల్మెట్లు, సేఫ్ గార్డులు, ఇతర రక్షణ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో అక్కడున్న జనం మొత్తం హోరెత్తేలా నినాదాలు చేశారు.
శ్రీ పురూహుతికా అమ్మవారి దర్శనం
అంతకు ముందు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం పిఠాపురం ప్రముఖ శక్తిపీఠం శ్రీ పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిఠాపురం, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వారాహి సభకు ముందు శ్రీ పాదగయ క్షేత్రానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గా భవాని ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మొదట విఘ్నేశ్వరుడిని, శ్రీపాద శ్రీవల్లభుడిని, శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తిస్వరూపిణి అయిన పురూహుతికా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజానంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు అందచేశారు.