AP Ceo: ఏపీ ఎన్నికలు - సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు, హోర్డింగులు తొలగించేందుకు డెడ్ లైన్
Andhra News: ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల ప్రకటనల హోర్డింగులు తొలగించాలని సీఈవో ఆదేశాలిచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Ap Ceo Key Orders: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకటనల హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయ పరిసరాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోపు రాజకీయ ప్రకటనల కటౌట్లు తొలగించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలుచేయాలి. ఎలక్ట్రానికి సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించాలి. 'సీ విజిల్' ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి.' అంటూ అధికారులకు నిర్ధేశించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధికారులlతో పాటు అదనపు సీఈవోలు పాల్గొన్నారు.
అయితే, ఇప్పటికే పలు ప్రధాన కూడళ్లలో రాజకీయ ప్రకటనల హోర్డింగులను అధికారులు తొలగిస్తున్నారు. అయితే, జెండాలు, హోర్డింగుల తొలగింపులో అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడ, విశాఖ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం వంటి ప్రముఖ నగరాల్లో ఫ్లెక్సీలను తొలగించారు. అయితే, అధికారులు.. వైసీపీ ఫ్లెక్సీలను తొలగించకుండా.. టీడీపీ, జనసేన పార్టీల జెండాలు, పోస్టర్లు, హోర్డింగులనే తొలగిస్తున్నారని ఆ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్నింటినీ తీసెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయా నగరాల్లో ఉన్నతాధికారులకు టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.
అన్న క్యాంటీన్ తొలగింపుపై దుమారం
మరోవైపు, మంగళగిరిలో స్థానికంగా ఉన్న అన్న క్యాంటీన్‌ను అధికారులు ధ్వంసం చేయడంపై వివాదం నెలకొంది. ఓ టెంట్ లో నిర్వహిస్తున్న అన్న క్యాంటిన్ ను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగిస్తున్నారంటూ.. క్యాంటీన్ నిర్వాహకులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉంటే ఫ్లెక్సీలు తొలగించాలి కానీ పేదలకి అన్నం పెట్టే క్యాంటీన్ టెంట్, సామాగ్రిని ధ్వంసం చేయడం ఏంటని వారు అధికారులను నిలదీశారు. ఆర్వో ఆదేశాలు కాకుండా ఆర్కే ఆదేశాలను పాటిస్తున్నారా టౌన్ ప్లానింగ్ అధికారులని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
ఏపీలో లోక్ సభ సహా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. వీటితో పాటే తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో 4వ విడతలో అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. 26న నామినేషన్ల పరిశీలించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు అవకాశం ఉంది. మే 13న పోలింగ్ నిర్వహించి, జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read: Tirumala News: తిరుమలకు వెళ్లేవారికి అలర్ట్! ఎన్నికల కోడ్ వల్ల ఆ సర్వీసుకు బ్రేక్