Somu Veerraju : 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !
2024 తర్వాత రాజకీయాల నుంచి విరమించుకోవాలి సోము వీర్రాజు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
2024 తర్వాత రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రెస్‌మీట్ పెట్టి అధికారిక ప్రకటన చేశారు. సోము వీర్రాజుకు డిపాజిట్ల కూడా రావని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారని.. తాను ఎప్పుడూ పదవుల కోసం ఎదురు చూడలేదన్నారు. 2014లో బుచ్చయ్య చౌదరిని పక్కన పెట్టి రాజమండ్రి టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. మంత్రి పదవి ఇస్తానన్నా తాను వద్దన్నానని చెప్పుకొచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీకి పాలించే సత్తా ఉందన్నారు. 42 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని 2024 తర్వాత ఉండబోనన్నారు.
సుజనా చౌదరి చెబితే తప్ప షెకావత్‌కు తెలియదా ?
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ పై వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలపై సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు గురించి సుజనా చౌదరి రాసిస్తేనే షెకావత్‌కు తెలుస్తుందా.. అని ప్రశ్నించారు. తప్పు జరిగితే చర్యలు తీసుకోవాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ఇదే కేంద్ర మంత్రి షెకావత్ పుట్టిన రోజు పండుగలు ఇదే నేతలు చేశారని సోము వీర్రాజు గుర్తు చేశారు. బీజేపీ నేతలకు కూడా చెప్పకుండా షెకావత్‌ని శ్రీకాళహస్తి తీసుకెళ్లి పూజలు దగ్గరుండి పూజలు చేయించారని గతంలో జరిగిన ఘటనను గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తున్న వాటి సంగతేంటి?
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ రంగ సంస్థలని మూసేశాయని ఇప్పుడు కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తోందని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షుగర్ ఫ్యాక్టరీలు, డెయిరీలు, స్పిన్నింగ్ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మూసేసిందన్నారు. పాయకరావు పేట షుగర్ ఫ్యాక్టరీని ఈ ప్రభుత్వమే అమ్మేసేందుకు సిద్దపడడం నిజం కాదా అని ప్రశ్నించారు.
Also Read: OTS Issue: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..
ఓ జిల్లా ఎస్పీకి ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి నెలకు రూ. ఐదు కోట్లు !
రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిందని.. ఓ జిల్లా ఎస్పీకి నెలకు రూ. 5 ఐదు కోట్లు ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి ముడుపులు అందుతున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంచనాలు పెంచేశారని చంద్రబాబుపై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారని సోము వీర్రాజు నిలదీశారు. పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పగించాలని సవాల్ చేశారు.
టిక్కెట్ ఇచ్చినప్పుడు రఘురామ అవినీతి గురించి తెలియదా?
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అవినీతిపరుడని బీజేపీలో చేరుతున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతున్నారని కానీ ఆయన గతంలో బీజేపీలో చేరితే టిక్కెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. గోకరాజు గంగరాజు పెద్దకుమారుడ్ని వైఎస్ఆర్‌సీపీలో చేర్చుకున్నారని.. మీరు చేర్చుకుంటే ఒకటి మరొక పార్టీ చేర్చుకుంటే ఒక విధానమా.. మీది నోరా తాటిమట్టా అని మండిపడ్డారు. టిక్కెట్ ఇచ్చినప్పుడు గుర్తు లేని రఘు రామకృష్ణం రాజు అవినీతి వైసీపీ నేతలకు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి