AP Budget: నేటి నుంచే ఏపీ బడ్జెట్ సమావేశాలు, తొలుత గవర్నర్ ప్రసంగం - TDP ప్లాన్ ఇదీ
AP Assembly: గవర్నర్‌గా బిశ్వభూషన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు.
Amaravati: నేటి నుంచి (మార్చి 7) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ (AP Budget Session) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor) ప్రసంగించనున్నారు. ఆ వెంటనే సభ మరుసటి రోజుకు వాయిదా పడనుంది. గవర్నర్‌గా బిశ్వభూషన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. అంతకుముందు కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ వర్చువల్‌గా ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై అసెంబ్లీలో జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.
బీఏసీ సమావేశం ముగిసిన వెంటనే ఏపీ సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం (AP Cabinet Meet) నిర్వహిస్తారు. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతోపాటు మరిన్ని అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Mekapati Gowtham Reddy) అకాల మృతికి సంతాపం తెలుపుతూ మంగళవారం ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు సంతాపం తెలిపిన తరువాత ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయాన్ని పాటిస్తూ ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడతాయి.
టీడీపీ నేతల వ్యూహం ఇదీ (TDP)
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ ఉదయం 9:30కు చంద్రబాబు (Chandrababu) నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేయనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడ్డాక అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి టీడీపీ నేత అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు.
కీలకం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly)
ఈ సారి ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు కాస్త కీలకం కానున్నాయి. మూడు రాజధానుల అంశం, సీఆర్డీఏ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు (AP High Court) ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చినందున, ఈ సమావేశాల్లో అమరావతిపై ఎలాంటి ప్రకటన చేస్తారో అనే ఆసక్తి నెలకొని ఉంది. కొత్త జిల్లాలపై కూడా తీవ్రంగా విమర్శలు వస్తున్న వేళ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనే అంశం కూడా ఆసక్తిగా మారింది. ఇవన్నీ కాక, అసలే ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిన వేళ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు ఎలా చెబుతారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది.