Palnati Yuddam : మరో మహాభారతం... పల్నాటి యుద్ధం ! వీరారాధన ఉత్సవాలు ప్రారంభం !
పల్నాటి యుద్ధం చరిత్రను ఓ సారి గుర్తు చేసుకుంటే మహా భారతమే జ్ఞాపకం వస్తుంది. పల్నాటి మహాభారతంగా భావించి పల్నాటి యుద్ధ వీరులకు ప్రతి ఏటా వీరారాధన ఉత్సవాల జరుగుతూంటాయి.
"పల్నాటి యుద్ధం" .. ఈ పేరు వింటే తెలుగు గడ్డపై జరిగిన ఓ మరపురాని యుద్ధం కళ్ల ముందు కదులుతుంది. పల్నాటి బ్రహ్మనాయుడు, నాగమ్మ వంటి వీరుల చరిత్రల కళ్ల ముందు కదులుతాయి. తెలుగు ప్రాంతంలో అనేక యుద్ధాలు జరిగాయి. కానీ అందులో పల్నాటి యుద్ధంలో వలె ఇప్పటికీ స్మరించుకుంటున్న యుద్ధాలు తక్కువ. కార్తీక అమావాస్య రోజున ప్రారంభమైనయుద్ధం ఐదు రోజులు జరిగింది. ఆ యుద్ధంలో మరణించిన బ్రహ్మనాయుడి వర్గం వారి ఆయుధాలను కారంపూడిలో ఇప్పటికీ ఏటా పూజిస్తారు. దానికి పల్నాటి వీరారాధనోత్సవాలు పేరుతో నిర్వహిస్తారు. అవి శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.
Also Read : ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది
చరిత్రలో పల్నాటి యుద్ధం కీలకం !
ఆంధ్రదేశంలోని పల్నాడు ప్రాంతములో క్రీ.శ. 1182లో పల్నాటి యుద్ధం జరిగింది. మహాభారతంకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉన్నాయి. అందుకే ఆంధ్ర భారతం అని కూడా పల్నాటి యుద్ధం గురించి చెబుతారు. పల్నాటి యుద్ధం 12వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మతమార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం. ఈ యుద్ధం తీరాంధ్రలోని రాజవంశాలన్నింటిని బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది. క్రీ.శ.1176-1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద పల్నాటి యుద్ధం శైవులు, వైష్ణవుల మధ్య జరిగింది. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు.
Also Read: మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉన్నాయా… అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే..
బ్రహ్మనాయుడు - నాగమ్మల మధ్య విరోధమే యుద్ధానికి తొలి మెట్టు !
పల్నాటి యుద్ధంలో ముఖ్య భూమిక పోషించిన వారు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ. ఇద్దరూ ఇరు రాజ్యాల్లో మంత్రులే. బ్రహ్మనాయుడు మాచర్లను పాలించిన మలిదేవరాజు వద్ద, నాగమ్మ గురజాలను పాలించిన నలగాముని వద్ద మంత్రులుగా పనిచేశారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి నాగమ్మే. బ్రహ్మనాయుడు వైష్ణవ సంభూతుడు. నాగమ్మ శివ భక్తురాలు. అనాదిగా శివ , వైష్ణవుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎవరి మత ప్రచారం వారు చేసుకున్నా ఆధిపత్య పోరు వెంటాడుతూనే ఉంది. బ్రహ్మనాయుడు కారంపూడి , మార్కాపురం, మాచర్లలో చెన్నకేశవ ఆలయాలను నిర్మించి తన విష్ణుభక్తిని చాటుకున్నాడు. నాగమ్మ శివ క్షేత్రాలను నిర్మించింది.బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం కల్పించారు. చాపకూటితో సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేశాడు. మాల కన్నమదాసును దత్తత పొంది మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా చేశాడు. అయితే నాగమ్మకు ఇది ఇష్టం లేదు. అగ్రవర్ణాలలో అధిక భాగం నాగమ్మ చెంతన చేరటంతో అటో ఇటో తేల్చుకోవాలనుకున్నారు. చివరికి కోడి పోరుకు సిద్ధమయ్యారు.
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
కోడి పోరులో కుతంత్రంతో బ్రహ్మనాయుడిపై నెగ్గిన నాగమ్మ !
రెండు వర్గాలు కోడిపోరు ద్వారా తేల్చుకోవాలని అనుకున్నాయి. అందులో భాగంగా కోడేరుగుట్టల వద్ద పోరుకు బరి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం రెంటచింతల మండలంలోని పాల్వాయి వద్ద ఉంది. పోరులో పాల్గొనటానికి చిట్టెమల్లు అనబడే కోడిని తీసుకొని బ్రహ్మనాయుడు అక్కడకు వస్తారు. నాగమ్మ కూడా సివంగిడేగ అనే కోడితో పందేలకు వస్తుంది. తొలి రెండు పోరుల్లో బ్రహ్మనాయుడు కోడి నెగ్గుతుంది. అయితే మూడో పోరు వచ్చే సరికి కుట్రలు చేసి నాగమ్మ విజయం సాధించిందని చరిత్రకారులు చెబుతారు. ఈ కారణంగా ఏడేళ్ల పాటు వనవాసానికి బ్రహ్మనాయుడు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఒక వేళ బ్రహ్మనాయుడు గెలిచినప్పటికీ అంతమొందించేందుకు కూడా నాగమ్మ కుట్ర పన్నినట్లుగా చరిత్ర చెబుతోంది. కోడిపోరు జరిగే ప్రదేశంలో ఒక తమకము తవ్వించి అందులో బల్లాలు, శూలాలు, విచ్చు కత్తులు ఉంచి పైన పందిరి ఏర్పాటుచేసి దానిపై వేదిక అమర్చినట్లుగా చెబుతారు. అయితే మూడో పోరులో బ్రహ్మనాయుడు ఓడిపోవడంతో పందెం ప్రకారం రాజ్యం అప్పగించి బ్రహ్మనాయుడు అరణ్యవాసం వెళ్తారు.
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...
ఏడేళ్ల తరవాత రాజ్యం అప్పగంచని నాగమ్మ - యుద్ధం అనివార్యం !
కోడిపోరులో ఓడిపోయిన బ్రహ్మనాయుడు, మలిదేవులతో కలిసి ఏడేళ్లు అరణ్యవాసంకు వెళతారు. నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఏడు సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన తర్వాత తన రాజ్యం తనకిమ్మని బ్రహ్మనాయుడు కబురు పంపుతాడు. అయితే నాగమ్మ అంగీకరించదు. పైగా దూతగా వచ్చిన నలగాముని అల్లుడైన అలరాజును చర్లగుడిపాడు వద్ద రహస్యంగా చంపిస్తుంది. యుద్ధమే ఇక రాజ్యాన్ని రాబట్టుకోవడానికి మార్గమని నమ్మి సిద్ధమవుతారు. కారంపూడిని యుద్ధక్షేత్రంగా ఖరారు చేశారు. అందుకే చరిత్ర పుటల్లో కారంపూడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే యుద్ధంలో చనిపోతున్న వారిని చూసి బ్రహ్మనాయుడు మనసు చలించింది. యుద్ధంలో ఓటమిని అంగీకరించి చనిపోయిన 66మంది వీర నాయకులకు లింగ ప్రతిష్టచేసి వీరారాధన ఉత్సవాలు జరిపించాలని పిడుగు వంశం వారిని వంశ పారంపార్యంగా ఏర్పరచి గుత్తికొండ బిలానికి తపస్సుకై వెళ్లిపోయాడు. నాగమ్మ కూడా యుద్ధానంతరం మనసు మార్చుకొని చేసిన తప్పిదం గుర్తించి ఆధ్యాత్మికంగా పయనించింది. ఇలా జరిగిన పల్నాటి యుద్ధంలో మృతిచెందిన వీరుల ఆత్మలు కార్తీక అమావాస్యనుండి ఐదురోజుల పాటు కారంపూడిలోని మరుభూమిలో అదృశ్యంగా విలపిస్తుంటాయని నమ్ముతూంటారు.
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
ప్రతి ఏటా వీరారాధన ఉత్సవాలు !
బ్రహ్మనాయుడు కోరిక మేరకు కార్తీక అమావాస్య నుంచి ఐదురోజుల పాటు రాచగావు, రాయభారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు పేరుతో వీరారాధన ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. 3వ తేదీన రాచగావు, 4న రాయభారం, 5న మందపోరు, 6న కోడిపోరు, 7న కల్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయి. తెలుగురాష్ట్రాల్లోని వీరాచారవంతులు తమ పూర్వీకుల ఆయుధాలతో కారంపూడికి చేరుకున్నారు.
Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి