జోగి రమేష్ , వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఫ్లెక్సీల చిచ్చు ! రంగంలోకి సజ్జల
జోగి రమేష్ , వసంత కృష్ణ ప్రసాద్ మధ్య మరోసారి వివాదం ఏర్పడింది. సమస్య పరిష్కారానికి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు.
Jogi Vs Vasantha : అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మద్య విభేదాలు సర్దిచెప్పే కొద్దీ పెరుగుతున్నాయి. మైలవరం నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతల మద్య విభేదాలు బహిర్గతం కావటంతో, అనుచరులు సైతం బాహా బాహీకి దిగుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతల మధ్య వివాదం పై క్యాడర్ లో సైతం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్ , మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదం బహిరంగంగా తెర మీదకు వచ్చింది. తాజాగా ఇద్దరు నేతలకు చెందిన వారు రెండు వర్గాలు విడిపోయి, నియోజకవర్గంలో గొడవలకు దిగుతున్నారు. వసంత వర్సెస్ జోగి గా మారి రాజకీయం పై పార్టీలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.
మైలవరంలో జోగి రమేష్ బర్త్ డే ఫ్లెక్సీలు
మంత్రి జోగి రమేష్ అనుచరుడు ధీరజ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసి ఫ్లెక్స్ బ్యానర్లు వ్యవహరం పై ఇరువురు నేతలకు చెందిన అనుచరులు గొడవపడ్డారు. ధీరజ్ పేరుతో ఏర్పాటు అయిన ఫ్లెక్స్ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే ఇదంతా మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ వర్గానికి చెందిన వారే చేశారనే అనుమానం మంత్రి జోగి రమేష్ అనుచరుల్లో వ్యక్తం అవుతోంది. వసంత వర్గానికి చెందని యువకులే ఫ్లెక్స్ బ్యానర్లను చించారని ఆరోపిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదని చించేసిన ఎమ్మెల్యే వర్గీయులు
అయితే ఫ్లెక్స్ బ్యానర్ లో మైలవరం నియోజకవర్గ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఫోటో బ్యానర్ లో లేదని , ఆ కారణం చేతనే వసంత అనుచరులు బ్యానర్లను చించేశారని అంటున్నారు. బ్యానర్ లో కేవలం మంత్రి జోగి రమేష్ కు చెందిన ఫోటో మాత్రమే ఉండటం పట్ల వసంత వర్గం గుర్రుగా ఉందని పార్టి వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ శివారు మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అనుచరుడు ధీరజ్ జన్మదిన సందర్భంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే బ్యానర్ లో స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఫోటో లేకపోవడం తో ఎమ్మెల్యే అనుచరులు రింగ్ సెంటర్లో ధీరజ్ సాయి ఏర్పాటు చేసిన బ్యానర్లు ను చింపివేశారని అంటున్నారు.
సీఎం చెప్పినా నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని వసంత అసంతృప్తి
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మంత్రి జోగి రమేష్, మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదం పై పార్టీ నేతలకు ఎప్పటి కప్పుడు సమాచారం అందుతోంది. గతంలోనే ఈ ఇద్దరు నేతల మద్య విభేదాల పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పంచాయితీ చేశారు. వసంత నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ ను ఎంకరేజ్ చేసే పరిస్దితి ఉండదని జగన్ స్పష్టంగా తెలియ చేశారు. దీంతో ఈ ఇద్దరు నేతల మద్య వివాదం కు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. అయితే అంతలోనే మరో సారి వివాదాలు తెర మీదకు వచ్చాయి. దీంతో ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించే బాద్యతలను జగన్ స్వయంగా అప్పగించారని అంటున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial