Annadatha Sukhibhava: అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్ పథకంపై రైతులకు గుడ్‌న్యూస్- మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Annadatha Sukhibhava PM Kisan Scheme | ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంపై అప్‌డేట్ వచ్చింది. 98 శాతం లబద్ధిదారులకు ఈ కేవైసీ పూర్తి చేశారు అధికారులు.

అమరావతి: అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 47 లక్షల 77 వేల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. లబ్ధిదారుల్లో 98 శాతం మందికి గ్రామ, వార్డు సచివాలయాల సర్వే ద్వారా ఈ కేవైసీ పూర్తయింది. దాదాపు 60 వేల మందికి పెండింగ్ ఉందని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలోనే అన్నదాత సుఖీభవ వెబ్సైట్ అందుబాటులోకి రానుంది.
రైతులకు ఎంత మేర లబ్ధి కలుగుతుంది..
అన్నదాత పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత గల రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 ఆర్థిక సహాయం అందుతుంది. సాగు భూమి కలిగిన, అటవీ భూమి సాగుదారు రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వపు పీఎం కిసాన్ ద్వారా రూ.6000 ఇస్తుంది. అదనంగా ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ 14000 అందిస్తుంది. మొత్తంగా రైతులకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.

రెండు విడతలలో నగదు జమ
అన్నదాత సుఖీభవ పథకానికి సొంత భూమి కలిగిన పట్టాదారులు, ఇనాం భూములు, అసైన్డ్ భూముల రైతులను అర్హులుగా గుర్తించినట్లు ఢిల్లీ రావు వెల్లడించారు. వెబ్ ల్యాండ్ లో ఆధార్ జత చేయకపోయినా, వివరాలు తప్పుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి పరిష్కరించుకోవాలి అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో, 2026 జనవరిలో రెండు విడతలుగా కవులు రైతులకు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నగదు అందిస్తామని పేర్కొన్నారు. భూమిలేని ఓసి బిసి ఎస్సి ఎస్టి ఇతర వర్గాల కవులు రైతులు ఈ పంటలో పేరు నమోదు చేసుకోవడంతో పాటు గుర్తింపు కార్డు పొందాలి. కేంద్రం వాటా నిధులు రాగానే, కూటమి ప్రభుత్వం తమ వాటాతో కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది అన్నారు.
గత ప్రభుత్వం డీ పట్టాదారులు, ఆర్‌ఒఎఫ్‌ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింప జేసింది. కూటమి ప్రభుత్వం వారితో పాటు అసైన్డ్, ఇనాం భూములు, డీ పట్టాదారులు, అందరినీ లబ్ధిదారులుగా చూస్తోంది. అన్నదాతా సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా కూడా ఏదాదిలో రెండు పర్యాయాలు పది వేల రూపాయల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. రైతులు సంబంధిత అధికారులను సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్‌లో https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళ్లి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. రైతులు తమ ఆధార్ నంబర్, తరువాత కాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వివరాలు పొందవచ్చు. సెర్చ్ చేసిన తర్వాత ఈకేవైసీ చేశారో లేదో కూడా తెలుసుకోవచ్చు.
అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
- అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.
- హోంపేజీలోని నో యువర్ స్టేటస్ (Know Your Status) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా నమోదు చేయాలి
- అనంతరం సెర్చ్ (Search) ఆప్షన్ పై క్లిక్ చేయగా స్టేటస్ కనిపిస్తుంది
- ఆల్రెడీ లబ్ధిదారుల అయితే స్టేటస్ Approved కనిపిస్తుంది. లేకపోతే రెవెన్యూ అధికారులను సంప్రదించి అన్నదాత సుఖీభ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.






















