Breaking News Live: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు అంతరాయం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 4న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన మోదుగుల దుర్గా ప్రసాద్, గుంటూరుకు చెందిన ఆమడ అరవింద్లు తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఉదయం నుంచి సరదాగా గడిపిన యువకులు.. సాయంత్రం కృష్ణానదిని చూసేందుకు బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు నదిలో దిగారు. ఈత రాకపోవడంతో నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, వారి కుటుంబసభ్యులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్ల సాయంతో పోలీసులు నదిలో గాలింపు చేపట్టారు. అరవింద్ మృతదేహం లభ్యం కాగా, దుర్గా ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు అంతరాయం
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కొద్దిసేపు స్తంభించిపోయాయి. కొన్ని నిమిషాల నుంచి సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ డౌన్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
ముంబయి డ్రగ్స్ కేసు... ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణ
ముంబయి డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ముంబై ఎస్పలాండె కోర్టు బెయిల్ నిరాకరించింది. మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. ఆర్యన్ ఖాన్, అర్బజ్ సేత్ మర్చంట్, మున్ మున్ ధామేచా కు అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడీకి అంగీకరించింది.
18వ తేదీ వరకు వ్యాపారాలు చేసుకోవచ్చు.. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ తరలింపుపై హైకోర్టు ఆదేశాలు
గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ఈ నెల 18 వరకు వ్యాపారాలు చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 4వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై విచారణ చేసిన హైకోర్టు 18వ తేదీ వరకు వ్యాపారాలకు అవకాశం కల్పించింది.
హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం
ఏపీ హైకోర్టు వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్రరావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది దంపతులను వెంటనే అడ్డుకున్నారు. దంపుతులను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు.
‘మా’ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు: ఏపీ మంత్రి పేర్ని నాని
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. మా ఎన్నికల విషయంలో తమకు ఎలాంటి ఉత్సాహం లేదని సోమవారం మీడియాకు ఆయన తెలిపారు. మా ఎన్నికలతో వైఎస్సార్‌సీపీకి, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కుగానీ, ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ సమాచార ప్రసారాలశాఖ మంత్రి స్పష్టం చేశారు.