(Source: ECI/ABP News/ABP Majha)
Andhra Pradesh జనం ఛీ కొట్టినా జగన్ చీటింగ్ బుద్ధి మార్చుకోలేదు - మాజీ సీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
Andhra Pradesh Politics | రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఛీకొట్టినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చీటింగ్ బుద్ధి మార్చుకోలేదంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Atchannaidu sensational comments on YS Jagan | అమరావతి: జనం ఛీ కొట్టినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నట్లు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు, నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఐదేళ్లలో ఏపీని అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చి రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది మీరు కాదా జగన్ రెడ్డి? అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల నుంచి ప్రతిపక్ష నేతల వరకు వారిపై దాడులు, దౌర్జన్యలు జరగని రోజు ఏదైనా ఉందా? అని నిలదీశారు.
‘పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతు కోసి చంపింది ఎవరు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి కళ్లుమూసుకొని కూర్చున్నారా? రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయి. జగన్ మానసిక పరిస్థితే బాగాలేదు. అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థంకాక కూటమి ప్రభుత్వంపై అబద్ధాలతో కుట్రలు పన్నుతున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ ముఠా పాలన నడిపింది మీరుకాదా జగన్ రెడ్డి? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై ఇప్పుడైనా తప్పుడు ప్రచారాలు మానుకో.. లేదంటే వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్ లో ఎటువంటి మార్పు రాలేదు. జగన్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయం’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఏపీలో ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోందని, లాం అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వం పెంచి పోషించిన గంజాయి గ్యాంగ్ వల్లే అక్కడక్కడా అలజడి చెలరేగుతోందని, త్వరలోనే వీటికి చెక్ పెడతామని ఏపీ మంత్రులు పలు సందర్భాలలో చెబుతూనే ఉన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ప్రజల రక్షణే తమకు ముఖ్యమని.. హద్దు మీరితే పోలీసు శాఖ ఎవరినీ వదిలి పెట్టదన్నారు.