AOB News: ఏవోబీలో మావోల అరుణారుణబాట, కొత్త ప్రజాస్వామిక విప్లవం దిశగా!
AOB Zone Maosits: జులై 28 నుంచి ఆగస్టు 3 వరకూ ఏవోబీ జోన్ వ్యాప్తంగా అమరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రా - ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సంసిద్ధం అవుతోంది.
ఒకప్పుడు ఆంధ్రా ఒడిశా బోర్డర్ మావోయిస్టులకు కంచుకోటలా ఉండేది. అబూజ్మడ్, జంగల్మహల్ లాగా పోలీసులు కనీసం కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా మంది మావోయిస్టు నేతలు ఎన్ కౌంటర్లలో మరణించారు. మరికొంతమంది కరోనాతో అస్వస్థతకు గురై ప్రాణాలు పొగొట్టుకున్నారు. ముఖ్యంగా ఏవోబీని సమన్వయం చేసే పెద్దదిక్కు అగ్రనేత ఆర్కే మృతితో మావోయిస్టు పార్టీకి దిశా నిర్దేశం కరువైందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్న తరుణంలో ఏవోబీలో మావోలు మళ్లీ అరుణారుణ బాట పేరుతో నూతన ప్రజాస్వామిక విప్లవానికి కార్యాచరణ రూపుదిద్దుతున్నారు.
అందుకు జులై 28 నుంచి ఆగస్టు 3 వరకూ ఏవోబీ జోన్ వ్యాప్తంగా అమరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రా - ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సంసిద్ధం అవుతోంది. భారత విప్లవోద్యమ నిర్మాతలు కామ్రేడ్ చారుమజుందార్ 50వ, కన్హయ చటర్జీ 40వ వర్థంతులను గొప్ప విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రకటన లేఖ 'ఆంధ్రపత్రిక' కార్యాలయానికి ఆదివారం ఉదయం చేరింది. ఇందులో శతృ 'సమాధాన్ - ప్రహార్' దాడులను ఓడిస్తూ, భారత నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో పురోగమించడానికి అరుణారుణ బాట పడుతున్నట్టు కార్యదర్శి గణేష్ వివరించారు.
ముఖ్యమంత్రులపై విమర్శలు
ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాల సామ్రాజ్యవాద, దళారీ బూర్జువా, భూస్వామ్య ప్రయోజనా లను కాపాడటంలో అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వాళ్లు ఏనాడూ వ్యతిరేకించకుండా వాటిని మనసుకు హత్తుకొని ఆహ్వానించి - అమలు చేస్తున్నారని గణేష్ విమర్శించారు. రెండూ రాష్ట్రాల్లో గల అత్యంత విలువైన ఖనిజసంపద, ఇతర విలువైన సంపదలను కారుచౌకగా దోపిడీవర్గాలకు అప్పజెప్పేందుకు అనేక ఒప్పందాలు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. పేదరికం, నిరుద్యోగం, ఆత్మహత్యలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ప్రజల తలలపై లక్షలు, కోట్లు అప్పులు కుప్పలు కుప్పలుగా ఏపీ, ఒడిషా ప్రభుత్వాలు పెంచుతున్నాయని ప్రకటన లేఖలో కార్యదర్శి గణేష్ పొందుపరిచారు.
గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యమా లకు ఊపిరైన ఏవోబీ ప్రాంతాల్లో ప్రజలు సమరశీల పోరాటాలు చేపట్టి అనేక విజయాలు సాధించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. దున్నేవాడికే భూమి అన్న నినాదంతో భూస్వామ్య, ఫారెస్టు, బంజరు, దేవాలయ భూములను లక్షల ఎకరాలు స్వాధీనం చేసుకున్న స్ఫూర్తి ఏవోబీ మావో ఉద్యమాలదన్న సంగతిని గుర్తు చేశారు. అందుకే పాలకవర్గాలు ప్రజాఉద్యమాన్ని అణచివేయాలన్న ఉద్దేశంతోనే ఆపరేషన్ 'సమాధాన్ - ప్రహార్' దాడులకు దిగుతున్నారని వాటిని ఎదుర్కొంటూ ప్రజాయుద్ధాన్ని పురోగమింపజేద్దామనే లక్ష్యంతో అమరుల స్మారకవారాన్ని జోన్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దామంటూ గణేష్ పిలుపు నిచ్చారు.
కామ్రేడ్స్ గొప్ప త్యాగాలను ప్రచారం చేద్దామని, అమరులకు గుర్తుగా స్థూప నిర్మాణాలు, పోస్టర్స్, కరపత్రాలు ద్వారా ప్రచారం కొనసాగిద్దామని, అమరుల త్యాగం, ధైర్య సాహసాలు, దృఢసంకల్పం వారి ఆదర్శాలను స్మరించుకుంటూ అమరుల బాటలో మరో ఉద్యమస్ఫూర్తితో అరుణారుణ బాట పడుదామంటూ కార్యదర్శి గణేష్ పత్రికా ప్రక టన విడుదల చేశారు. ఏవోబీ జోన్ వ్యాప్తంగా 12మంది కామ్రేడ్స్ దోపిడీ పాలకవర్గాలు మావో ఉద్యమంపై కొనసాగిస్తున్న విప్లవ ప్రతీఘాతుక దాడులను ప్రతిఘటిస్తూ అశువులు బాసిన కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ అక్కిరాజు హరిగోపాల్ (సాకేత్) తోపాటు డివిజనల్ కమిటీ సభ్యులు రణదేశ, ఆశోక్, అనిల్, ఏరియా కమిటీ సభ్యులు అంజన్న, పాయికే, సోనీ, పార్టీ సభ్యులు చైతే, లలిత, ఆజాద్ అలాగే అలూరి లలిత, జన నాట్యమండలి విప్లవ సాంస్కృతిక కళాయెధుడు డప్పు రమేష్ అమరత్వం గుర్తులతో మరో ఉద్యమానికి ఏవోబీలో అరుణారుణ బాట పడదామంటూ ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.