Anantapur News : పరుగు ప్రభాకర్ @ 87 - అలసిపోని తాతయ్య అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
Anantapur News : స్వర్ణ పథకమే లక్ష్యంగా సాధన చేస్తున్నారు 87 ఏళ్ల వృద్ధుడు. అథ్లెటిక్స్ లో ప్రతిభ చూపేందుకు ఏళ్ల తరబడి సాధన చేస్తున్నారు. 85-90 ఏళ్ల గ్రూపు మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు ఏపీ నుంచి హాజరు కాబోతున్నారు ఈ పెద్దాయన.
Anantapur News : వయసుకు వృద్ధుడే కానీ పరుగులో చిరుత వేగం. అతడే అథ్లెట్ ప్రభాకర్ రావు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గతంలో రైల్వే ఉద్యోగం చేసిన ఆయన 1993లో పదవీ విరమణ పొందారు. కర్నూలు ఆయన స్వస్థలం. లక్ష్యానికి తగ్గట్టుగానే సాధన చేస్తూ అకుంఠిత దీక్షతో స్వర్ణ పతకం వైపు అడుగులు వేస్తున్నారు. రైల్వేలో విధులు నిర్వహించే సమయంలో రైల్వే ఉద్యోగుల మధ్య నిర్వహించే పోటీలలో ప్రభాకర్ ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచేవారు. ఎన్నో స్వర్ణ పథకాలు సాధించారు. దేశంలోని అనేక రైల్వే జోన్లలో తన పరుగు ప్రతిభను చాటి పతాక శీర్షికలలో నిలిచారు. పదవీ విరమణ పొందిన తర్వాత పరుగుకు బ్రేక్ పడుతుందని కుటుంబ సభ్యులతో పాటు సహచరులు, స్నేహితులు అనుకున్నారు. కానీ ప్రభాకర్ తన పరుగు ఆపలేదు. ప్రభాకర్ రావు దృష్టి అంతా ఇప్పుడు మాస్టర్ అథ్లెట్స్ వైపు మళ్లింది. ఇంకేముంది ప్రతి సంవత్సరం నిర్వహించే మాస్టర్ అథ్లెట్స్ కు క్రమం తప్పకుండా హాజరవుతారు ప్రభాకర్. ఎన్నో పథకాలను ఇక్కడ కూడా సాధించాడు. పోటీలకు ఏడాది ముందు నుంచే సాధన చేయడం మొదలు పెడతారీ పెద్దాయన. సమయపాలన విషయంలో ఆయన రాజీపడరు. ఆయన నుంచి యువకులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎందుకంటే అనంతపురం పట్టణంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ గ్రౌండ్ మెయిన్ గేట్ తెరవకముందే ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారు. అంతగా టైం మెయింటెనెన్స్ చేస్తారు మరి.
మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
85-90 ఏళ్ల గ్రూపు మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు రాష్ట్రం నుంచి ప్రభాకర రావు హాజరు కాబోతున్నారు. ఇక్కడ విజయాన్ని నమోదు చేస్తే నేషనల్స్ కు ఎంపిక అవుతారు. గతంలో కూడా అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చూపే అవకాశం వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోటీలకు దూరంగా ఉండిపోయారు. కళ్ల ముందు కదిలే స్వప్నం గుండెల నిండా లక్షాన్ని ఛేదిస్తాననే చేవ పరిగెత్తడానికి పిక్కల సత్తువ ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లేందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో గుండెలనిండా బాధతోనే పోటీలకు హాజరుకాలేదు. తన సాధన గురించి, సాధించిన పథకాల గురించి బోసి నోటితో చెప్పే ఈ తాతయ్య. పరుగుల ట్రాక్ ఎక్కితే మాత్రం నవయువకుడు అయిపోతారు. ఇలాంటి మరిన్ని పోటీలకు హాజరై, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని ఏబీపీ తరఫున ..ఆల్ ది బెస్ట్ తాతయ్యా..!
Also Read : IPL 2022 Records: ఫాస్టెస్ట్ సెంచరీ హీరోలు వీరే.. యూనివర్సల్ బాస్ శతకం మాత్రం ఎప్పటికీ హైలైట్