Anakapalli News : కొట్టేసిన బైక్ ను పట్టేసిన పోలీస్ యాప్, కానీ నాలుగేళ్ల తర్వాత!
Anakapalli News : సుమారు నాలుగేళ్ల కిందట చోరీకి గురైన బైక్ ను పోలీస్ యాప్ పసిగట్టేసింది. ఇక బైక్ దొరకలేదులే అనుకుని కేసును పక్కన పడేసిన పోలీసులకు యాప్ షాక్ ఇచ్చింది.
Anakapalli News : పోలీసుల కేసుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రోజురోజుకూ అప్ గ్రేడ్ అవుతున్న టెక్నాలజీతో దర్యాప్తు సంస్థలు కేసులను ఛేదిస్తున్నారు. వేలి ముద్రలు పసిగట్టడం నుంచి సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ వరకూ టెక్నాలజీ అవసరం ఎంతో ఉంది. ఎంతో క్లిష్టమైన కేసులను కూడా అతి తక్కువ సమయంలోనే ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలకు టెక్నాలజీ సీక్రెట్ ఏజెంట్ లా పనిచేస్తుంది. నాలుగేళ్ల కిందటి ఓ కేసును టెక్నాలజీ సాయంలో కాకినాడ జిల్లా పోలీసులు ఛేదించారు.
అసలేం జరిగింది?
కాకినాడ జిల్లా తునిలో నాలుగేళ్ల క్రితం చోరీకి గురైన ఓ బుల్లెట్ బైక్ ను పోలీస్ యాప్ పసిగట్టింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎస్ఐ లక్ష్మణరావు శనివారం అబీద్ కూడలిలో వాహన తనిఖీలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి చెందిన ఓ యువకుడు బైక్ పై వస్తున్నాడు. అతడిని ఆపిన ఎస్ఐ వాహన పత్రాలు తనిఖీ చేశారు. వాహనానికి సంబంధించిన కొన్ని రికార్డులు లేకపోవడంతో ఎస్ఐ ఈ-చలానాలోని బోలో ఆప్షన్ ఉపయోగించి వివరాలు కోసం తనిఖీ చేశారు. దీంతో అందులోని అలారం ఒక్కసారిగా మోగి, అప్రమత్తం చేసింది. AP 05 DR 2755 నెంబర్ గల బుల్లెట్ 2019లో చోరీకి గురైందని ఆ వాహన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు వివరాలు ఎస్ఐకు స్క్రీన్ పై కనిపించాయి.
పోలీస్ యాప్ సాయంతో
అప్రమత్తమైన ఎస్ఐ వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని తుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు నాలుగేళ్ల తర్వాత పోలీసుల యాప్ సాయంతో బైక్ పట్టుబడటంతో తుని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. బైక్ ఇంక దొరకదని కేసును పక్కన పడేసిన పోలీసులకు యాప్ కీలకంగా మారింది. చోరీకి గురైన బైక్ ను నాలుగేళ్ల తర్వాత పట్టించింది. దీంతో పోలీసులు బైక్ ను స్వాధీనం చేసుకుని వాహనదారుడిని ప్రశ్నిస్తున్నారు. ఆ బైక్ అతడే చోరీ చేశాడా లేక మరొకరి వద్ద కొనుగోలు చేశాడా? అని దర్యాప్తు చేస్తు్న్నారు. కేసుల దర్యాప్తులో టెక్నాలజీ సాయం ఎంతైనా ఉందని పోలీసులు అంటున్నారు. యాప్ సాయంతో నాలుగేళ్ల కిందట చోరీకి గురైన బైక్ ను గుర్తించగలిగామని అంటున్నారు.