YSRCP MLA: చెవిరెడ్డి అసెంబ్లీలో ఎందుకలా చేస్తున్నారు? సెంటిమెంటా? భక్తా?
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో వైసీపీ వర్సెస్ టీడీపీ. సస్పెండ్ అవుతున్నా వెనక్కి తగ్గని ప్రతిపక్షం. ఇరు పక్షాల మధ్య వాడీవేడీ డిస్కషన్స్ నడిచింది. ఈ చర్చలో చాలా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చాలా హాట్‌హాట్‌గా సాగుతోంది. సారా మరణాలపై ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ సభ్యులు రోజూ సస్పెండ్ అవుతున్నారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గడం లేదు. భిన్న రూపాల్లో నిరసన చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ సభ్యులు తీరును వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. సభా మర్యాదను కాలరాస్తున్నట్టు టీడీపీ సభ్యుల తీరు ఉందని మండిపడుతున్నారు. ప్రజాసమస్యలను సభలో చర్చ రాకుండా టీడీపీ రాద్దాంతం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ప్రజల్లో ఇంకా చులకన అవుతన్నారని... రాబోయే ఎన్నికల్లో కనీసం ఇప్పుడున్న సీట్లు కూడా రావంటూ విమర్శలు చేస్తున్నారు.
అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చెప్పులు వేసుకోకుండానే సభకు వస్తున్న సంగతి బయటకు తెలిసింది. ఓ వ్యక్తి చెప్పిన మాట ప్రకారం ఆ శాసనసభ్యుడు చెప్పుల్లేకుండానే సభకు వస్తున్నారట.
బుధవారం సభకు వచ్చిన టీడీపీ సభ్యులు చిడతలు తీసుకొచ్చి వాయించారు. జగన్ చిడతల ద్వారా చెప్తేనే అర్థమవుతుందన్న కోణంలో తమ నిరసన తెలిపారు. దీనిపై అధికార పక్షం తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటి చర్యలు పద్దతి కాదని... భవిష్యత్‌లో వారికి చిడతలే మిగులుతాయని ఎద్దేవా చేసింది.
టీడీపీ సభ్యుల అనుచిత వైఖరిని తప్పుపట్టిన వైసీపీ సభ్యులు... వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. దీనిపై మాట్లాడిన అంబటి రాంబాబు చాలా ఆసక్తికరమైన విషయాన్ని సభకు తెలియజేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనను తప్పుబడుతూనే వారికి భవిష్యత్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఏం జరగని అంశాన్ని సభలోకి తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు రాంబాబు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే టీడీపీ ఎమ్మెల్యేలు చిడతలు వాయిస్తున్నారని విమర్శించారు. శాసనాలు చేసే సభకు ప్రత్యేక గౌరవం ఉందని తమ పార్టీ సభ్యులంతా అదే రెస్పెక్ట్‌తో సభకు వస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే చెవిరెడ్డి విషయాన్ని సభకు వివరించారు.
వైసీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అసెంబ్లీపై అపారమైన గౌరవం ఉందన్న అంబటి రాంబాబు.. అదే గౌరవంతో సభకు చెప్పుల్లేకుండా వస్తున్నారని తెలిపారు. ఒక గురువు చెప్పినట్టు ఆయన సభలో చెప్పులు వేసుకోవడం మానేశారని వివరించారు. అలాంటి సభ్యులు వైసీపీలో ఉంటే విలువే లేని సభ్యులు టీడీపీలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విషయం రాంబాబు చెప్పిన వెంటనే సభలో హర్షధ్వానాలతో దద్దరిల్లింది. దేవాలయం లాంటి సభలో రాద్దాంతం చేస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని రాంబాబు కోరారు. సభలో హుందాగా ఉండాలని టీడీపీ సభ్యులను కోరారు.