టీడీపీ హయాంలో ఒకే వర్గానికి ప్రాధాన్యత, జగన్ పాలనలో నాయీ బ్రాహ్మణులకు మేలు!
వెనకబడిన వర్గాలకు మేలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది అన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
వెనకబడిన వర్గాలకు మేలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది అన్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర జరిగిన నాయీ బ్రాహ్మణ ధన్యవాదాలు సభకు సజ్జల మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, వేణుగోపాల్ హాజరయ్యారు. నాయీ బ్రాహ్మణులను చట్ట సభలోకి అడుగు పెట్టేలా జగన్ చేస్తారన్నారు మంత్రి జోగి రమేష్.
తాడేపల్లిలో నాయీ బ్రాహ్మణ కృతజ్ఞతా సభ...
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయీ బ్రాహ్మణుల కృతజ్ఞతా సభ జరిగింది. ఈ సభకు హాజరయిన బీసీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. అన్ని ఆలయాల పాలక మండలిలో స్థానం కల్పించటంపై నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ వృత్తిదారులకు జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఆలయాలలో పనిచేసే వారికి రూ.20వేలు వేతనం అందిస్తున్న జగన్ తమకు అన్ని విధాలుగా మేలు చేసేందుకు నిత్యం పరితపిస్తున్నారని అన్నారు. తమకు పలు రకాలుగా మేలు చేసిన జగన్ ప్రభుత్వం, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సభ ఏర్పాటు చేశామన్నారు.
అప్పుడు ఆ సామాజిక వర్గానికే న్యాయం...
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఒక సామాజిక వర్గం తప్ప మరెవరూ బాగు పడలేదన్నారు. కుల వృత్తులు చేసుకునే వారు తమ సమస్యలు పరిష్కారించమని చంద్రబాబును కోరితే, మీ తోకలు కత్తిరిస్తామంటూ చంద్రబాబు బెదిరించారని గుర్తు చేశారు. ఇవే సమస్యలు జగన్ కి చెప్తే ఎంతో సానుకూలంగా స్పందించారని అన్నారు. ఎంత వీలైతే అంత మేలు చేయాలని నాకు సీఎం చెప్పారని, జీవో 110 ద్వారా నాయీ బ్రాహ్మణులకు మేలు చేయగలిగామని చెప్పారు. ముకేష్ అంబానీ లాంటి వాళ్లు సెలూన్ బిజినెస్ చేస్తున్నారని, నాయీ బ్రాహ్మణులు మరింత సమర్ధవంతంగా పని చేయాలన్నారు. పోటీని ఎదుర్కొని నిలపడాలని సూచించారు. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట నిలపెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు.
బీసీ అంటే వైసీపీనే...
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ అన్నివిధాలా అండగా నిలిచారని వివరించారు. బీసీలలో ఎన్ని కులాలు ఉంటాయో కూడా తెలియని మనకి రాజకీయంగా నిలపెట్టారని, నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభలో అడుగు పెట్టేలా చేస్తారని, అది కూడ త్వరలోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దమ్ము, ధైర్యం కేవలం జగన్ కే సాధ్యమని, సుదీర్ఘ పాదయాత్రలో జగన్ బీసీల కష్టాలు చూశారని, అందుకే అనేక సంక్షేమ పథకాలు తెచ్చి అండగా నిలిచారని వివరించారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని, చంద్రబాబుకు బీసీలంటే చిన్నచూపుని విమర్శించారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ అవహేళన చేశారని, ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు, కంబళ్లు ఇచ్చి ఇక మీకు చాల్లే అంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం జగన్ కారణంగా బీసీల పిల్లలు నేడు పెద్దపెద్ద చదువులు చదువుతున్నారని, ఆలయాల పాలక మండలిలో సైతం నాయీ బ్రాహ్మణులు సభ్యులయ్యారని వివరించారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ బీసీలకు మరిత ప్రాధాన్యత ఇస్తారనటంలో సందేహం లేదని, వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలకు అధికంగా సీట్లను కేటాయించటం కూడా జగన్ కే సాధ్యం అవుతుందన్నారు. జగన్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే, కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి, అన్ని పదవులను బీసీలకు ఇచ్చిన చరిత్ర జగన్ దేనని వివరించారు.