MLC Ashok Babu: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, రూ.900 కోట్ల ఆదాయం: అశోక్ బాబు
MLC Ashok Babu: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై రూ.280 కోట్ల పెట్టుబడి పెడితే ఇప్పటి వరకు రూ. 900 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.
MLC Ashok Babu: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుతో అద్భుతమైన ఆదాయం వస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై రూ.280 కోట్ల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు రూ. 900 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. ఫైబర్ నెట ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అశోక్ బాబు.. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుతో నెలకు రూ. 12 కోట్ల ఆదాయం వస్తోందని స్వయంగా వైసీపీ నేతలే చెబుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఫైబర్ నెట్ గురించి ఆరోపణలు చేసినట్లు ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఫైబర్ నెట్ ప్రాజెక్టును ప్రశంసించినట్లు గుర్తు చేశారు. కేవలం నెలకు 149 రూపాయలకే కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ ని ఈ సంస్థ అతి చౌకగా అందించిందని అశోక్ బాబు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల కనెక్షన్లు తగ్గిపోయాయని.. రేట్లు కూడా భారీగా పెంచి నెలకు రూ.350 చేశారని ఆరోపించారు.
ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, జరగని అవనీతిపై చంద్రబాబు పేరు చెప్పాలని జగన్ మోహన్ రెడ్డి సర్కారు అధికారులను వేధిస్తున్నట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. ఫైబర్ నెట్ లో ఒక రూపాయి అవినీతి కూడా జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో ఎక్కడా డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలు లేవని అన్నారు. రూ. 120 కోట్లు అవినీతి జరిగింది అంటూ వైఎస్సార్సీపీ చేసే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. కేంద్ర సర్కారు చేపట్టిన భారత్ నెట్ కి స్ఫూర్తే ఏపీ ఫైబర్ నెట్ అని పేర్కొన్నారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో ప్రభుత్వ పాత్ర పరిమితమని, ఇందులో అంతా అధికారుల నేతృత్వంలోని కమిటీల ద్వారానే పనులు జరుగుతుంటాయని తెలిపారు. చంద్రబాబు చేపట్టిన ఏ ప్రాజెక్టు సక్సెస్ కాకూడదనే ఈ ప్రభుత్వ అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై విచారణ నేడు జరగాల్సి ఉంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. సీఐడీ కస్టడి పొడిగింపు పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాగా, బెయిల్ పిటిషన్ అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా.. రేపు కోర్టులో కోరాలని న్యాయమూర్తి సూచించారు.
సెలవులో విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి
మరోవైపు, నేడు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వ్యవహరించారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారణ చేయాలని న్యాయవాదులు ఇన్‌ఛార్జి జడ్జిని కోరారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ-14 గా లోకేశ్ పేరు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును కూడా సీఐడీ చేర్చింది. లోకేశ్ పేరును ఏ - 14గా సీఐడీ చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌ను దక్షిణం వైపున మార్చి లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు.