Mangalagiri MLA RK: షర్మిలతో నడుస్తా - అవసరమైతే జగన్‌పై కేసులు వేస్తా-ఆర్కే సంచలన ప్రకటన
Mangalagiri MLA RK: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వెంటనడుస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటన చేశారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. పార్టీకీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు మరో ప్రకటనతో ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె వెంట నడుస్తానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అక్రమాలు చేసిన ఎవరిపైనా అయినా కేసులు వేస్తానని అది జగన్ కావచ్చు, చంద్రబాబు, లోకేష్ ఎవరిపైనా అయినా కవచ్చని అన్నారు.
సుమారు ఇరవై రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు ఆర్కే. అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. రాజీనామా చేసిన రోజే ప్రెస్‌మీట్ పెట్టి చాలా తక్కువ మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ మీడియాతో మాట్లాడారు. విమర్శల డోస్ కాస్త పెంచారు.
రాజీనామా చేసిన తర్వాత చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆర్కే ఈ మధ్య కాలంలో తన అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థుల పొలిటికల్ యాక్టివిటీ పెంచడంతో ఆర్కే కూడా అలర్ట్ అయ్యారు. అందులో భాగంగా తరచూ వివిధ ప్రాంతాల ప్రజలతో కలుస్తున్నారు.
ఇలా సమావేశాలు నిర్వహించే క్రమంలో ఇవాళ మీడియాతో కూడా మాట్లాడారు ఆర్కే. తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని వైసీపీని వీడలేదని క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో ఉండాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. తాను ఎప్పటికీ వైఎస్ కుటుంబం వ్యక్తినే అన్నారు. అందుకే వైఎస్‌ఆర్‌సీపీకి ఎంతో సేవ చేశానని చెప్పుకొచ్చారు. సర్వస్వం పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపై వైఎస్ షర్మిల తీసుకునే నిర్ణయం బట్టి తన ప్రయాణం ఉంటుందన్నారు ఆర్కే. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటానన్నారు. తాను షర్మిలను కలిశానని తెలియజేశారు. ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలని వైసీపీని ఉద్దేశించి అన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని అన్నారు.
మంగళగిరి అభివృద్దికి నిధులు మంజూరులో కూడా చాలా అలసత్వం జరిగిందన్నారు. 1200 కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం జగన్ తర్వాత దాన్ని 120 కోట్లకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించాననన్నారు ఆర్కే. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని తెలిపారు. కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తెచ్చినా తాను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగానని వివరించారు.
స్వయంగా తానే 8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని వెల్లడించారు ఆర్కే. తన సొంత డబ్బుతో ఎంటీఎంసీ ,దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేసామన్నార. లోకేష్‌ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తాను ఎవరిని నిందించడం లేదని తెలిపారు. నిధులు మంజూరు చేస్తానని తనకు ధనుంజయ రెడ్డి చాలా సార్లు మేసేజీలు పెట్టారని వివరించారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారని నిలదీశారు.
తన రాజీనామా ఆమోదించకపోవడం అనేది వాళ్ళ ఇష్టమన్నారు ఆర్కే. తాను మాత్రం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశానన్నారు. మంగళగిరి ప్రజలకు మాత్రం దూరంగా ఉండబోనని తెలిపారు. ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. ఉంటే వైసీపీలో ఉంటాను అని చెప్పా ఇప్పుడు వైసీపీ వీడానని మళ్లీ వెళ్లే ప్రసక్తి లేదన్నారు. తాను వేసిన ప్రశ్నలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.