Andhra Pradesh : ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకే- ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆగ్రహం
Andhra Pradesh : ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకు వెళ్తారని కామెంట్ చేశారు.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగోలు ప్రభుత్వంపై తీవ్ర అంసతృప్తితో ఉన్నారని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అభిప్రాయపడింది. అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. హామీలు చూసి కూటమికి ఓటు వేసిన ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై ఒక్కసారి కూడా చర్చలు జరపలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఉద్యోగులకు కీలకమైన 9 హామీలను కూటమి ప్రభుత్వం ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆదివారం తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూమిట సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. ఏడాదిలో ఒక్కసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలు చర్చించకపోవడమే కాకుండా వారిని చాలా దారుణంగా చూస్తున్నారని విమర్శించారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను చాలా గౌరవంగా చూసుకున్నారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. వాలంటీర్లను తీసేసి వారి పనులను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారని వాపోయారు. ఇంటింటికీ తిప్పడమేంటని నిలదీశారు. ఇంత చేసినప్పటికీ సర్వేల పేరుతో అవమానాలుపాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలికే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు వెంట్రామిరెడ్డి. డీజీ స్థఆయి అధికారులను జైల్లో పెట్టడమేంటని ప్రశ్నించారు. ఒక వేళ భవిష్యత్‌లో ప్రభుత్వం మారితే సగం మంది పోలీసులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని హెచ్చరించారు. అంతలా పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దిగజార్చేసిందని ఆరోపించారు. సీపీఎస్, జీపీఎస్ విధానంపై ఇంత వరకు ఎలాంటి సమీక్ష చేయలేదని, దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదని అన్నారు. కనీసం పీఆర్‌సీ గురించి కూడా పట్టించుకోవడం లేదన్నారు. రాజీనామా చేసిన పీఆర్‌సీ కమిషన్ స్థానంలో కొత్తది ఇంత వరకు నియమించలేదని వాపోయారు.
వైసీపీలో 27 శాతం ఐఆర్ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వలేదని అన్నారు వెంకట్రామిరెడ్డి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి కేబినెట్‌లోనే 27 శాతం ఐఆర్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఒకటో తేదీని జీతాలు ఇస్తామని చెప్పినా ఇంత వరకు జరగలేదని అన్నారు. జీతాలు కాదుకదా వారికి ఇవ్వాల్సిన బకాయిలు గురించి కూడా ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు. వాలంటీర్లను కొనసాగిస్తామన చెప్పి వారిని ఏకంగా పీకేశారని ఆ పని కూడా ప్రభుత్వ ఉద్యోగులపై పడుతుందని అన్నారు. ఆప్కాస్ కింద ఉన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను మళ్లీ ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లో పెడుతున్నారని ఇది ప్రమాదకరమని హెచ్చరించారు. ఉద్యోగుల పట్ల ఇంత నిర్దయగా ఉన్న ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదని అన్నారు. వెంటనే ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని లేకుంటే ఉద్యమబాట పట్టాల్సి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరించారు.





















