Pawan Kalyan: వారసత్వాన్ని ప్రజలపై రుద్దకండి- రక్తసంబంధాన్నే పక్కన పెట్టేస్తాను- పార్టీ నేతలకు పవన్ హెచ్చరిక
Janasena Chief Pawan Kalyan: సహజంగా ఎదిగే నాయకత్వాన్నే జనసేన ప్రోత్సహిస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మీ వారసత్వ రాజకీయాలను ప్రజలపై రుద్దవద్దని తన పార్టీ లీడర్లకు హెచ్చరించారు.
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: వారసత్వ రాజకీయాలపై జసేనన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు ఘాటు హెచ్చరికలు చేశారు. క్రమశిక్షణ తప్పి తనకు తలనొప్పులు తీసుకురావద్దని సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో తన పార్టీ ప్రజాప్రతినిధులను సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడిన పవన్... కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా కుటుంబాల నుంచి కొత్త తరం నాయకులు రావడం సంతోషమే అన్న పవన్ కల్యాణ్... వారిని బలవంతంగా ప్రజలపై రుద్ద వద్దని హితవు పలికారు. సహజంగానే ఎదిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
"క్రమశిక్షణ రాహిత్యంతో తలనొప్పి తీసుకురావద్దు. రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను. జనం కోసం కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. నేను లేకపోతే ఎన్నికల్లో ఎలా గెలుస్తారు... పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారనే బ్యాచ్‌కు ఇదే నా హెచ్చరిక. అలాంటి చోట ఓడిపోవడానికి కూడా సిద్ధమే కానీ నేను సిద్ధాంతాలపరంగా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి రాదు."
సహజంగా ఎదిగితే ఓకే: పవన్
ఈ ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నా పెద్దగా బాధపడే వాడిని కాదన్నారు పవన్ కల్యాణ్. అలాగని నేతలను తక్కువ చేయడం లేదన్న డిప్యూటీ సీఎం... సహజంగా ఎదిగే నాయకులను ప్రోత్సహిస్తామన్నారు.
జనసేన ప్రజా ప్రతినిధులకు సత్కారం
— JanaSena Party (@JanaSenaParty) July 15, 2024
Live Link: https://t.co/MLJjRhf5o6
"ఓడిపోతే ఏం పోతుంది... ఇవాళ 21 ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు గెలిచారు. ఇప్పుడు ఎలా ఉన్నారో అవి గెలవకపోయి ఉన్నా ఇలానే ఉండేవాడిని. నా తీరు ఏం మారదు. ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకోండి. మీ కుటుంబాలకు మీకు సహాయకారిగా ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ... భవిష్యత్‌లో వాళ్లే మా వారసులు అని చెప్పడానికి సిద్ధంగా ఉండను. ఇలా చేసుకుంటూ పోతే కొత్త వాళ్లకు చోటు ఎక్కడ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తానంటే హ్యాపీయే కానీ... వాళ్లను సహజంగానే నాయకులయ్యే విధంగా ప్రోత్సహించండి. ప్రజలపై రుద్దవద్దు అని పార్టీ లీడర్లకు సూచనలు చేశారు.
ఒకట్రెండు ప్రాంతాల్లో ఇలాంటివి వినిపిస్తున్నాయన్న పవన్ కల్యాణ్... ఇకపై వినిపించడానికి వీల్లేదన్నారు. భవిష్యత్‌లో జరగకుండా ఉండాలంటే మనసు విప్పి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో దీనిపై స్పష్టత ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ప్రజల్లో ఉండండి
గెలిచిన ప్రజాప్రతినిధులంతా ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పార్టీ తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో ముడిపడినవే అన్నారు. అందుకే సబ్జెక్ట్‌పై పట్టు పెంచుకోవాలని.. అప్పుడే ప్రజాసమస్యల పరిష్కారానికి అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ప్రజలను మాట్లాడనివ్వలేదని చంద్రబాబు సహా చాలా మంది జైల్లో పెట్టించిందని తమ పార్టీ ఎంపీనే కొట్టించిందని అన్నారు పవన్. ఊరిలో మాట్లాడినా... సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా కేసులు పెట్టి వేధించిందన్నారు. అందుకే ప్రజలంతా మూకుమ్మడిగా బుద్ది చెప్పారని వివరించారు.
వారిలా తప్పులు చేయొద్దు
గత ప్రభుత్వం చేసిన తప్పులు గమనించి మనం అలాంటి తప్పులు చేయొద్దని లీడర్లకు సూచించారు. చట్టసభల్లో ప్రజాసమస్యలపైనే మాట్లాడాలని చెప్పారు. జనసేన అంటే ప్రజాసమస్యలపై పోరాడుతుందనే భావన ప్రజల్లో ఉందని దాన్ని నిలుపుకోవాలన్నారు. తాను ప్రధాని గుండెల్లో ఉన్నాను అనేందుకు కారణం కూడా అదేనన్నారు. వైసీపీ వాళ్లు ప్రత్యర్థులేకానీ శత్రువులు కాదన్నారు పవన్ కల్యామ్. వారిపై కక్ష సాధింపులు వద్దని హితవు పలికారు. వారి చేసిన తప్పులను చట్టం పరిధిలో శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోదీకి ఏం అడగలేదన్న పవన్ కల్యాణ్ తొలిసారి రాష్ట్రం కోసం పలు డిమాండ్లు ఆయన ముందు ఉంచబోతున్నట్టు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు, రైల్వేజోన్ ఇలా పలు డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన చేతిలో రాష్ట్రం ఉంటే కచ్చితంగా అభివృద్ధి సాధిస్తుంది మరోసారి స్పష్టం చేశారు.
గుండెల్లో పెట్టుకొని తనను జనసేన పార్టీ నాయకులను గెలిపించిన వారందరికీ పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యావాదాలు చెప్పారు. జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎలాంటి పదవులు ఆశించకుండా జనసేన గట్టిగా నిలబడిందన్నారు.
Also Read:త్వరలోనే అధికారంలోకి వస్తాం- తోకలు కత్తిరిస్తాం- విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్