Andhra Pradesh News: లోకేష్ అడ్డాలో సీఎం జగన్ భారీ సభ- 57 నెలలకే ప్రభుత్వం గొంతు పిసికేస్తున్నారని ఆవేదన
Mangalagiri News: లోకేశ్ ఎమ్మల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం నిర్వహించారు. బీసీ సీటులో ఈజీగా విజయం సాధించవచ్చని ఎవరెవరో పోటీ చేస్తున్నారని జగన్ అన్నారు
Jagan Vs Lokesh: ఐదేళ్లు పాలించాలని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కేవలం పూర్తి కాలం ఉండనీయకుండా చేస్తున్నారని మంగళగిరి సభలో సీఎం, వైసీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. 57 నెలలకే ప్రజాప్రభుత్వం గొంతు పిసికేయలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అందాల్సిన పథకాలను కూడా అందనీయకుండా చేస్తుంటే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా కోర్టుల్లో పోరాటం చేస్తున్నారని అన్నారు.
లోకేశ్ ఎమ్మల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంగళగిరిలో వైసీపీ అధినేత జగన్ ప్రచారం నిర్వహించారు. బీసీ సీటులో ఈజీగా విజయం సాధించవచ్చని ఎవరెవరో పోటీ చేస్తున్నారని జగన్ అన్నారు. కోట్లు కుమ్మరించి మంగళగిరి సీటును గెలవాలని చూస్తున్నట్టు విమర్శించారు. వారు భారీగా డబ్బులు పంచవచ్చన్న జగన్ వాటిని తీసుకొని మంచి చేసిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
59 నెలల్లో మీ బిడ్డ జగన్ పాలన చూసి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలన్నారు జగన్. ఓటు వేసే ముందు ఇంట్లో అందరూ కూర్చొని చర్చించుకొని మంచి చేసే వాళ్ల పక్షాన నిలబడాలని సూచించారు. "ఈ ఐదేళ్ల కాలంలో మీ బిడ్డ పాలనలో చరిత్రలో చూడని విధంగా గతంలో జరగని విధంగా మొదటిసారిగా ఏకంగా 2లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధదారులకు చేరాయి. వివిధ పథకాలకు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. అక్కచెల్లమ్మల చేతికే డబ్బులు ఇచ్చాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండానే సంక్షేమ పథకాలు అందించాం. "
" గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ఆలోచించండి. ఇలా బటన్‌లు నొక్కడం నేరుగా ఖతాల్లో డబ్బులు పడటం ఎప్పుడైనా జరిగిందా ఆలోచించుకోండి. 2 లక్లల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ఆలోచించండి."
2014లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ అందులో హామీలు ఒక్కొక్కటిగా చదువుతూ జరిగాయా లేదా అని ప్రజలను అడిగారు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో ఇదే ముగ్గురు కలిసి తీసుకొస్తున్నారని విమర్శించారు. " అదే ముగ్గురు, మరో మేనిఫెస్టోతో వస్తున్నారు. నమ్ముతారా? సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? సూపర్ సెవన్ అంటా నమ్ముతారా?. ఊరిలో ఎవరైనా దొంగతనే చేస్తే కేసులు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. ఇలా ఐదేళ్లుకోసారి మోసం చేసే వాళ్లను ఏం చేయాలి."
"జగన్‌కు ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఈర్ష్యపడి పింఛన్లు రాకుండా చేశారు. వాళ్లే ఇప్పుడు రెండు నెలల క్రితం నొక్కిన బటన్‌ల డబ్బులు ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడూ ఎన్నికల ముందు కొత్త పథకాలు అంటూ హడావుడి చేయలేదు. గెలిచిన మొదటి రోజు నుంచి సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసి ప్రతి నెల అక్క చెల్లమ్మల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం."
" సంక్షేమ పథకాలు రాకుండా చేస్తున్న వాళ్లపై కోర్టుల్లో పోరాడాల్సి వస్తోంది. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుల్లో పోరాడుతున్నాడు. ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రజలు ఐదేళ్లకు అంటే 60 నెలలకు ఎన్నుకుంటారు. కానీ జగన్ ప్రభుత్వాన్ని 57 నెలలకే గొంతుపట్టుకొని పిసికేయాలని కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ గొంతు పట్టుకున్నది జగన్‌ది కాదు.. అక్కచెల్లమల గొంతు, రైతుల గొంతు, విద్యార్థుల గొంతు"
ఇలాంటి వారందరికి బుద్ది చెప్పాలంటే 13న రెండు బటన్స్ నొక్కితే సరిపోతుందన్నారు జగన్. "ఇలాంటి వారిని ఏం చేయాలి. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి. 175 కు 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదు. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి."
మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లావణ్యను గెలిపించాలని ప్రజలకు జగన్ విజ్ఞప్తి చేశారు. బీసీలు ఎక్కువ ఉండే ఈ సీటుపై ఎవరెవరో కన్నేశారని అందుకే డబ్బులు మూటలతో వస్తున్నారని ఓటుకు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు ఇచ్చే నోట్లు తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే వేయాలన్నారు జగన్. ఆ డబ్బు ప్రజలదే అన్నారు. తన జీవిత కాలంలో ఎప్పుడూ బటన్ నొక్కని చంద్రబాబు వద్ద బాగానే డబ్బులు ఉన్నాయన్నారు జగన్. బటన్స్ నొక్కిన తన వద్ద మాత్రం అంత డబ్బులేదన్నారు. డబ్బు పంపిణీలో చంద్రబాబుతో పోటీ పడలేనన్నారు. అందుకే ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని మంచి చేసిన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు వేడుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లావణ్యను, ఎంపీగా పోటీ చేస్తున్న రోశయ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.