Ramoji Rao Quash Petition: రామోజీరావు, శైలజా కిరణ్ క్వాష్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా
Ramoji Rao Quash Petition: ఏపీ హైకోర్టులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ ల క్వాష్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
Ramoji Rao Quash Petition:
వెలగపూడి : ఏపీ హైకోర్టులో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ ల క్వాష్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన గాదిరెడ్డి జగన్నాథరెడ్డి (జీజే రెడ్డి) కుమారుడు యూరిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. మార్గదర్శిలో ఉన్న తన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అవకతవకలకు పాల్పడి శైలజా కిరణ్ పేరు మీదకు మార్చారని యూరిరెడ్డి ఆరోపించారు. తాను ఒప్పుకోనందున తుపాకీతో బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ.. కేసులో ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజా కిరణ్‌లను చేర్చారు.
సీఐడీ ఎఫ్ఐఆర్ ను సవాలు చేస్తూ రామోజీరావు, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం వరకు రామోజీరావుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఐడీ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దాంతో ఇరుపక్షాల వాదనలు బుధవారం వింటామన్న హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రామోజీరావు, శైలజ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హజరయ్యారు. ఇప్పటికే స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు తరపున లూథ్రా వాదిస్తున్న విషయం తెలిసిందే.
తన తండ్రి జి జగన్నాథరెడ్డి పేరు మీద మార్గదర్శిలో షేర్స్ ఉన్నాయని యూరిరెడ్డి తెలిపారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ పెట్టుబడితో 288 షేర్లు తన తండ్రికి వచ్చాయన్నారు. తన తండ్రి 1985లో చనిపోయారని, కానీ ఆయన పేరిట షేర్లు ఉన్నాయని ఆ సమయంలో తమకు తెలియదన్నారు. 2014లో మార్గదర్శిలో జీజే రెడ్డికి షేర్లు ఉన్నట్లు మీడియా ద్వారా తెలవడంతో అప్పటినుంచి సంప్రదించడానికి ప్రయత్నించగా.. 2016 సెప్టెంబర్ 29న తమ తండ్రి షేర్ల గురించి అడగడానికి సోదరుడు మార్టిన్‌రెడ్డి, యూరిరెడ్డి వెళ్లినట్లు చెప్పారు. సోదరులిద్దరిని గదిలో ఉంచి రామోజీరావు తన తుపాకీతో బెదిరించి వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి తెలిపారు.
అనంతరం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో వాటాదారు అయిన యూరిరెడ్డి తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తన తండ్రి జీజే రెడ్డి పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజకిరణ్ పేరిట బదిలీ చేసినట్లు గుర్తించారు. యూరిరెడ్డి సంతకాలను సైతం ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేశారని యూరిరెడ్డి ఆరోపించారు. తన షేర్లను అక్రమంగా శైలజకిరణ్ పేరిట బదిలీచేశారని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలంటూ యూరిరెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారని పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై చర్యలు తీసుకోవాలని యూరిరెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. యూరిరెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ అధికారులు రామోజీ, శైలజా కిరణ్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.