స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినా చంద్రబాబు బయటకు రాకుండా సీఐడీ బిగ్ ప్లాన్
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబును విచారించాలని ఏపీ సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఒక వేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినా అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణకు కోర్టులో పిటిషన్ వేసింది. 2022లో నమోదైన ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది.
ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చిన వెంటనే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు సిఐడీ సిద్ధమవుతోంది. అందుకే కోర్టులో పిటిషన్ మూవ్ చేసింది. కేవలం కాగితాలకే పరిమితం చేసి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో దోపిడీ చేశారని 2022లో ప్రభుత్వం సీఐడీ విచారణ ఆదేశించింది. అలైన్‌మెంట్‌ను నచ్చినట్టు మార్చేశారని ఆరోపిస్తోంది. ఫలితంగా వేల కోట్ల రూపాయలు అనుయాయలకు దోచి పెట్టారని పేర్కొంది.
చంద్రబాబు టీంలో మంత్రిగా ఉన్న నారాయణ ఈ అవినీతిలో భాగమై ఉన్నారని కూడా చెబుతోంది ప్రభుత్వం. ఆ అవినీతిలో భాగంగానే లింగమనేని రమేష్‌తో కుమ్మక్కై ఆయన భవనంపై ఉంటున్నారని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. మొదట 94 కిలోమీటర్లకే ఇన్నర్ రింగ్ రోడ్డును పరిమితం చేసిన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అలైన్మెంట్ మార్చారని ఆరోపిస్తోంది. ఈ మార్పు కారణంగా చంద్రబాబుతోపాటు అనుయాయలు భారీగా లబ్ధి పొందారని విమర్సిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసును విచారించిన సీఐడీ ఏ-1గా చంద్రబాబును, ఏ-2గా నారాయణను, ఏ-3గా లింగమనేని రమేశ్‌ను, ఏ -6గా నారా లోకేష్‌ను ఉంచింది. ఇప్పుడు ఈ కేసునే తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబును అష్టదిగ్బంధం చేయాలని చూస్తోంది.
ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని,నారాయణ ఫ్యామిలీ మెంబర్స్ ఆస్తులను, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని కోర్టులో అభ్యర్థన పెట్టింది. ఈ కేసులోనే చంద్రబాబును విచారించాలని కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వస్తే వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు ప్లాన్ చేశారు.