Andhra Pradesh:డ్వాక్రా సంఘాల కోసం ప్రత్యేక యాప్- అక్రమాలకు ప్రభుత్వం చెక్
Andhra Pradesh: డ్వాక్రా సంఘాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. రుణాలు, పొదుపుల చెల్లింపుల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేయనుంది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలవారి పొదుపు చెల్లింపులు,తీసుకున్న లోన్ వాయిదాలు చెల్లించడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకురానుంది. నేరుగా బ్యాంకులకు వెళ్లి చెల్లింపులు చేయడంలో ప్రక్రియ ఆలస్యమవుతోంది. మహిళల సమయం కూడా వృథా అవుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా చాలా మంది గ్రూప్ సభ్యులను మోసం చేస్తున్నారు. అన్నింటికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ఈ యాప్ ఆలోచన చేస్తోంది.
మహిళా సంఘాల కోసం ప్రత్యేక యాప్ తీసుకొస్తున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక యాప్ తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం. జరుగుతున్న మోసాలకు, ఎదుర్కొంటున్న సమస్యలకు, సమయం వృథాకు అన్నింటికి యాప్‌తో పరిష్కారం చూపబోతోంది. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు బ్యాంకు లింకేజి, స్త్రీనిధి రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా స్ట్రాంగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రక్రియలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా రుణం తీసుకున్న మహిళలే నేరుగా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేలా ప్రత్యేక పేమెంట్ యాపప్ తీసుకొస్తోంది.
ఒక్కో సభ్యురాలికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందజేస్తారు. దీన్ని వాయిదాల్లో రెండేళ్లు లేదా మూడేళ్లలో చెల్లించాలి. ఈ వాయిదాలు చెల్లించే బాధ్యతను ఆయా గ్రూప్ లీడర్లకు అప్పగిస్తుంటారు. అయితే వాళ్లు సరిగా చెల్లించడం లేదు. ఏదో ఒక రోజు తెలిసి మొత్తం గందరగోళం అవుతుంది. తర్వాత రుణం పేరుకుపోయి లబ్ధిదారులు లబోదిబోమంటున్న పరిస్థితులు మనం నిత్యం చూస్తున్నాం.
మోసాలకు చెక్ చెప్పేలా యాప్ డిజైన్
ఇలాంటి వాటికి పూర్తిగా చెక్ పెట్టేందుకే యాప్ ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఇకపై ప్రతి పైసాకు కచ్చితమైన లెక్క ఉండేలా ప్రజల డబ్బులు సక్రమంగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా జాగ్రత్త పడుతోంది. ఈ యాప్‌ను మహిళలు తమ మొబైల్స్‌లోనే డౌన్‌లోడ్ చేసుకొని గ్రూప్ ఖాతాలో ఎంత నగదు ఉంది. ఎంతమంది చెల్లిస్తున్నారు. ఇంకా ఎవరు చెల్లించడం లేదనే విషయాలు తెలుసుకోవచ్చు. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని అక్రమాలకు ఆస్కారం ఉండదని చెబుతోంది ప్రభుత్వం.
నేరుగా మహిళలకు చెల్లింపుల మేసేజ్‌లు
ఈ యాప్‌లో చెల్లింపుల చేసినప్పుడు నేరుగా ఆయా మహిళల ఫోన్‌లకే మెసేజ్‌లు వస్తాయి. ఇప్పుడు వాడుతున్న డిజిటల్ చెల్లింపుల యాప్‌ల మాదిరిగానే ఈ రాబోయే యాప్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మహిళలు ఈ బ్యాంకు రుణాలను పేటీఎం ద్వారా చెల్లిస్తుననారు. కానీ ఇది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఇప్పుడు యాప్ అందుబాటులోకి వస్తే పెద్ద ఎత్తున ప్రచారం కల్పించనుంది ప్రభుత్వం. అందరూ విధిగా యాప్‌ను వాడుకునేలా ప్రోత్సహిస్తారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన యాప్ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. అందుకే యాప్ రావడం కాస్త లేట్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లేకుంటే ఎప్పుడో రావాల్సింది అంటున్నారు.





















