Chandrababu : వైసీపీకి 175 స్థానాల్లో గుండు సున్నా, పులివెందులలోనూ ఓడిస్తాం - చంద్రబాబు
Chandrababu : కర్నూలు టూర్ తర్వాత వైసీపీలో భయంపట్టుకుందని చంద్రబాబు అన్నారు. అందుకే 8 జిల్లాల్లో వైసీపీ అధ్యక్షుల్ని మార్చారన్నారు.
Chandrababu : సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ ఓటమి తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 స్థానాల్లోనూ గుండు సున్నా వస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో చంద్రబాబు సదస్సులో నిర్వహించారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన ఇటీవల కర్నూలులో చూశానన్నారు. కర్నూలు బహిరంగ సదస్సుకు పెద్ద ఎత్తున యువత, ప్రజలు తరలివచ్చారన్నారు. కర్నూలు సభ తర్వాత వైసీపీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ భయంతోనే 8 మంది జిల్లాల అధ్యక్షుల్ని మార్చేశారని చెప్పారు.
ఆక్వా రైతులకు టీడీపీ మ్యానిఫెస్టో.
— Telugu Desam Party (@JaiTDP) November 24, 2022
ఆక్వా రంగానికి చెందిన రైతులతో చర్చించిన మీదట, ఈ క్రింద పేర్కొన్న కొన్ని ముఖ్య చర్యలు చేపట్టడం ద్వారా ఆక్వా రైతులను ఆదుకోవడం సాధ్యమని టీడీపీ భావిస్తుంది. వీటితో పాటు చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర చర్చ జరిగింది. (1/2) pic.twitter.com/Lh5Te5PMZQ
సీడ్ ధరలు నియంత్రిస్తాం
ఆక్వా రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఆక్వా రంగానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. పరిమితులు లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆక్వా రంగంలో జోన్, నాన్ జోన్ విధానాలను తొలగిస్తామన్నారు. సీడ్ ధరల్ని నియంత్రిస్తామన్న చంద్రబాబు... నీటి పన్ను, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటును పాత ధరలతోనే అమలు చేస్తామని వెల్లడించారు. జనరేటర్లు వాడే అవకాశం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను ఆక్వా రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాలను టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.
ఆక్వా రంగాన్ని సంక్షోభం నుండి కాపాడాలి అనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. అదే ఉంటే ఆక్వా రైతులతో మాట్లాడి, వాళ్ళ సమస్యలను సావధానంగా విని సమస్యల పరిష్కారానికి ప్రయత్నించేవారు.(1/2) pic.twitter.com/shuO2SXajr
— Telugu Desam Party (@JaiTDP) November 24, 2022
నెల్లూరు చోరీ కేసుపై
నెల్లూరు కోర్టులో పత్రాలను చోరీ చేసే ఘనులకు సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. మంత్రి కాకాణి తన పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలపై మంత్రి కాకాణిని సీఎం జగన్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుంటే డిస్మిస్ చేయాలని చంద్రబాబు సూచించారు. సీఎం జగన్ పైనే సీబీఐ కేసులున్నాయి కాబట్టే డిస్మిస్ చేయరన్నారు. దొంగలు, దోపిడీదారుల బ్యాచ్ తయారై తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించి ఓడించి బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు అన్నారు. ఇదేం ఖర్మ-రాష్ట్రానికి అనే చర్చ గ్రామాల్లో జరగాలని చంద్రబాబు పార్టీ క్యాడర్ కు సూచించారు. తగినన్ని వనరులు ఉన్నా రాష్ట్రానికి పట్టిన ఖర్మకు ఏకైక కారణం సీఎం జగన్ అని విమర్శించారు. మనుషులుగా తప్పులు చేయటం సహజమని తప్పులు సరిదిద్దుకోకుంటే మనిషికి పశువుకు తేడా లేదన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ వాస్తవాలు గ్రహించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.