Nick Vujicic Met CM Jagan : ఏపీలో కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, నిక్ వుజిసిక్ కితాబు
Nick Vujicic Met CM Jagan : అంతర్జాతీయ మోటివేషన్ స్పీకర్ నిక్ వుజిసిక్ సీఎం జగన్ ను కలుసుకున్నారు. ఏపీలో విద్యారంగంలో అమలుచేస్తున్న సంస్కరణపై నిక్ హర్షం వ్యక్తం చేశారు.
Nick Vujicic Met CM Jagan : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ కలుసుకున్నారు. విద్యారంగంలో మార్పుల కోసం జగన్ పని చేస్తున్నారని నిక్ అభినందించారు. సీఎం జగన్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు నిక్ వుజిసిక్.
ఏపీలో వరల్డ్ క్లాస్ విద్యను అందిస్తున్నారు- నిక్
"నేను చాలా దేశాల్లో పర్యటించాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ కలుసుకోలేదు. ఇక్కడి సీఎం చాలా ముందుచూపుతో సంస్కరణలు చేపడుతున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సంస్కరణలు తీసుకువస్తున్నారు. సీఎం చాలా డైనమిక్ గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో డెవలప్ చేశారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ప్రపంచం మొత్తం తెలియాలి. సీఎం జగన్ ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పదో తరగతిలో నా లైఫ్ ను పాఠంగా పెట్టారు. అది చూసి ఎంతో సంతోషించాను. అది నాకు చాలా ప్రోత్సాహకంగా ఉంది. ఇక్కడ విద్యారంగంలో నా వంతు చేయాలనుకుంటున్నాను. ఇక్కడ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ స్కూల్ కు వెళ్లిన ముఖ్యమంత్రి పేరు మారుమోగిపోతుంది. వరల్డ్ క్లాస్ విద్యను ఇక్కడి స్కూళ్లలో అందిస్తున్నారు." -నిక్ వుజిసిక్
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్. pic.twitter.com/ji296VDWAL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 1, 2023
ఈ ప్రాంతం నాకు ప్రేరణ
గుంటూరులోని చౌత్రా సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్ మంగళవారం సందర్శించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఇంగ్లీషులో మాట్లాడుతున్న తీరు, భాషలో స్పష్టత ఎంతో ఆశ్చర్యంగా ఉందని నిక్ వుజిసిక్ అన్నారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు నిక్ వుజిసిక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తానికి తాను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు కానీ, ఈ ప్రాంతం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని నిక్ అన్నారు. 10వ తరగతి విద్యార్థినులతో మాట్లాడిన ఆయన లక్ష్యసాధనపై దిశా నిర్దేశం చేశారు. ఏపీలో స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమాలు జరుగుతున్నాయని నిక్ ప్రశంసించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని సీఎం జగన్ ను ప్రశంసించారు.
ఇటీవల మల్లారెడ్డి వర్సిటీలో ప్రసంగం
హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి నిక్ వుజిసిక్ మాట్లాడారు. విద్యార్థులను తన మోటివేషనల్ స్పీచ్ తో ఉత్తేజపర్చారు. వచ్చిన ప్రతి అవకాశాలను ఉపయోగించుకొని ముందుకు సాగాలని, ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుని పట్టుదలతో కృషి చేయాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు. పుట్టుకతో భుజాలు లేకుండా జన్మించిన వుజిసిక్, మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతను అధిగమించడానికి తన వ్యక్తిగత కథను, తన జీవన ప్రయాణంలో సాధించిన సానుకూల దృక్పథం పోషించిన పాత్రను వివరిస్తూ , విద్యార్థులు తమ ఎదుగుదలకు తగిన ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ కలలను వదులుకోవద్దని సూచించారు. నిక్ వుజిసిక్ తన వ్యక్తిగత అనుభవాలను, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలను పంచుకోవడం వల్ల విద్యార్థులు ఎంతో ప్రేరణ, స్ఫూర్తి నింపుతూ, ఎవరికి వారు తనను తాను విశ్వసించాలన్నారు. విద్యార్థులు వారి కలలు నెరవేర్చుకోవడానికి ఎదురయ్యే అడ్డంకులను అధిగమించగలరన్నారు. మన మార్గంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎప్పటికీ వదులుకోకూడదని, మన కలల కోసం ప్రయత్నిస్తూనే ఉండమని ఉపన్యాసం ముగించారు.