Ambati Rambabu : పోలవరంలో చంద్రబాబు డ్రామా, ప్రాజెక్టు వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతిలేదు - మంత్రి అంబటి
Ambati Rambabu On Chandrababu : పోలవరం వద్ద చంద్రబాబు డ్రామా చేశారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరం వద్ద ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతిలేదన్నారు.
Ambati Rambabu On Chandrababu : పోలవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామా చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం చంద్రబాబు పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. చంద్రబాబు విమర్శలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరం వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతిలేదన్నారు. అందుకే చంద్రబాబుకు ప్రాజెక్టు పరిశీలనకు అనుమతి ఇవ్వలేదన్నారు. తనకు డయాఫ్రమ్ వాల్ అంటే ఏమిటో తెలియదని చంద్రబాబు అన్నారని, ఆ విషయం తనకు తెలుసో, లేదో ప్రజలు, అధికారులకు తెలుసునని అంబటి రాంబాబు అన్నారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం తప్పిదం కాదా? అని ప్రశ్నించారు. పోలవరంపై తాను మూడు ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. పోలవరం ఖర్చు కేంద్రం భరించాలని చట్టంలో ఉంటే గత ప్రభుత్వం ఎందుకు నెత్తిన వేసుకుందన్నారు. 2018 నాటికి పోలవరం ద్వారా నీళ్లిచ్చి ఎన్నికలకు వెళ్తానని చంద్రబాబు చెప్పారని మరి ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.
పోలవరం వద్ద చంద్రబాబు రాద్ధాంతం
చంద్రబాబు రోజుకో డ్రామా చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. చంద్రబాబు చేస్తోన్న ఇదేమి ఖర్మ రోడ్ షోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పోలవరం వద్ద కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేశారన్నారు. అనుమతి లేకుండా పోలవరం ప్రాజెక్టుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదన్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి జన సమూహంతో అనుమతి లేకుండా ప్రాజెక్టుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఏమి చేస్తే నమ్ముతారని ఆలోచన లేకుండా టీడీపీ వాళ్లు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న పనులకు ప్రజలు ఇదేం ఖర్మ అని అనుకుంటున్నారని హోంమంత్రి వనిత అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న హోంమంత్రి...
పెట్టిన ఒక్క గేట్ కూడా వరదలకు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం జగన్ పాలనలోనే పోలవరం పనులు జరిగాయన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని హితవుపలికారు.
చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
" ఇదేమి ఖర్మ.. రాష్ట్రానికి "కార్యక్రమంలో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు పోలవరంలో పర్యటించేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పోలవరం వైపు వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. మధ్యాహ్నం నుంచే పోలీసులు పోలవరం ప్రాంతంలో మహోరించారు. టీడీపీ శ్రేణులు, చంద్రబాబు పోలవరం వైపు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ కార్యకర్తలు తోసుకెళ్లే అవకాశం ఉండటంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించే పెద్ద పెద్ద లారీలను తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టారు. చంద్రబాబు వచ్చే సరికి రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీంతో చంద్రబాబునాయుడు పోలీసులపై మండిపడ్డారు.