YSRCP : వైఎస్ఆర్‌సీపీ పార్టీ పదవులకు ఆళ్ల నాని గుడ్ బై - జగన్‌కు షాకిచ్చిన మాజీ మంత్రి
Eluru : వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. రోజుకొకరు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లగా ప్రకటించారు.
Alla Nani resigned from YCP party posts Eluru : వైఎస్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు.. రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్‌కు లేఖ రాశారు. అయితే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదని అనుచరులు చెబుతున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని అందుకే .. పార్టీ పదవులకు రాజీనామా చేశారని చెబుతున్నారు.
రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్న ఆళ్ల నాని
ఏలూరు జిల్లాలో సీనియర్ నాయకుడు ఆళ్ల నానిగా ప్రసిద్ధుడైన కాళీ కృష్ణ శ్రీనివాస్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మొదటి సారి 2004లో గెలిచారు. తర్వాత 2009లోనూ గెలిచారు. 2014లో ఓడిపోయారు. మళ్లీ 2019లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన డిప్యూటీ సీఎం హోదా జగన్ ఇచ్చారు. కానీ రెండున్నరేళ్ల తర్వాత పదవి నుంచి తప్పించారు. మంత్రిగా కీలకమైన శాఖల్ని ఇచ్చిపన్పటికీ ఆయనకు స్వేచ్చగా పని చేసుకునే అవకాశం లభించలేదు.
పార్టీలో వర్గ పోరు - ప్రత్యర్థులకు జగన్ ప్రోత్సాహం
మంత్రి పదవి పోయిన తర్వాత మరింత సైలెంట్ అయ్యారు. పార్టీ తరపున పోటీ చేస్తారా లేదా అన్నదానిపైనా అనుమానాలు వచ్చాయి. అయితే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి ఆయనను బుజ్జగించారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకత్వం ఇతర నేతల్ని ప్రోత్సహించింది. ఈ కారణంగా ఆయన కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. హైకమాండ్ తీరుపై మనస్తాపానికి గురయ్యారు. గత ఎన్నికల్లో ఆయన ఎప్పుడూ లేని విధంగా 62 వేల ఓట్ల తేడాతో.. టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఇకపూర్తి స్థాయిలో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు నేరుగా పార్టీకి రాజీనామా చేయకపోయినా పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
ప్రస్తుతానికి పార్టీ పదవులకు రాజీనామా
పార్టీకి రాజీనామా చేయలేదు కాబట్టి ఆయనను హైకమాండ్ బుజ్జగిస్తుందని వైసీపీ నేతలు బావిస్తున్నారు. అయితే కొన్ని కారణాలతోనే పార్టీకి రాజీనామా చేయలేదని కానీ ఇప్పటిక్పుపుడు మళ్లీ యాక్టివ్ రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని ఆళ్ల నాని అనుచరులు చెబుతున్నారు. ఏడాది తర్వాత ఆయన పరిస్థితుల్ని బట్టి ఇతర పార్టీల్లో చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ప్రతీ రోజూ వైసీపీకి కీలక నేతల రాజీనామాలు
వైఎస్ఆర్‌సీపీకి ప్రతి రోజూ ఎవరో ఒక ప్రముఖ నేత రాజీనామా చేస్తూండటంతో ఆ పార్టీలో కొత్త గుబులు ప్రారంభమయింది. పార్టీ భవిష్యత్ పై ఆందోళనతో ఉన్న వారు .. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు.