Case On Achenna : మనోభావాలు దెబ్బతీశారని ఎస్ఐ ఫిర్యాదు - అచ్చెన్నపై కుప్పంలో కేసు !
అచ్చెన్నాయుడుపై కుప్పంలో కేసు నమోదయింది. ఆయనపై ఎస్ఐ ఫిర్యాదు చేశారు.
Case On Achenna : కుప్పం సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ అచ్చెన్నాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శు బహిరంగ సభలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు... పోలీసుల్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. పోలీసుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారంటూ కుప్పం ఒన్ టౌన్ ఎస్సై రవి కుమార్ ఈ మేరకు కుప్పం పోలీసు స్టేషన్ లో అచ్చెన్నాయుడు పైన కేసు నమోదు చేశారు. పాదయాత్ర భద్రతకు ఐదు వందల మంది వచ్చారని అయినా వారు తినడానికే వచ్చినట్లుగా వ్యవహరించారు కానీ.. ఎవరూ విధులు నిర్వహించలేదని భద్రత కల్పించలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
పోలీసులపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఖండించిన పేర్ని నాని
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని బహిరంగసభ అయిపోయిన తర్వాత విమర్శలు గుప్పించారు. పోలీస్ గన్‌మెన్ల భద్రతతో బతికే మీరు.. పోలీసుల గురించి ఇంత అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.. పోలీసులను కించపరుస్తూ.. నిర్లజ్జగా మాట్లాడే వారిని ఏమనాలి? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇటువంటి వారు ఆ పార్టీ అధ్యక్షులు అయితే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే.. మీ తొలు ఒలిచి.. పొలీసులకు 'షూ' తయారు చేయిస్తానని పేర్ని నాని ఘటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఘాటు విమర్శలు చేసిన తర్వాత రోజే .. ఎస్ఐ రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పోలీసులు సరిగ్గా గమనిస్తే అచ్చెన్నాయుడు పిర్రలు పరగొట్టవచ్చన్న మంత్రి అప్పలరాజు
అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేయడాన్ని మంత్రి అప్పలరాజు సమర్థించారు. అచ్చెన్నాయుడు సిక్కోలు వాసి అయి ఉండి.. పోలీసులపై అలా మాట్లాడటం బాధకలిగించిందన్న ఆయన.. పోలీసులు సరిగ్గా గమనిస్తే అచ్చెన్నాయుడు పిర్రలు పగలగొట్టొచ్చని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడును ప్రజలే మట్టి కరిపిస్తారని హెచ్చరించారు. గతంలోనూ పోలీసులుపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పోలీసులపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు ఖండించారు.
కుప్పం నియోజకవర్గ పోలీసులపై గతం నుంచీ తీవ్ర ఆరోపణలు
కుప్పం నియోజకవర్గంలో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు పర్యటించినప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణలు జరిగాయి.అయితే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతలపైనే కేసులు పెట్టి చాలా కాలం పాటు జైల్లో ఉంచారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. బాధితులపై కేసులు పెడుతున్న పోలీసుల్ని వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ఇప్పుడు నేరుగా టీడీపీ ఏపీ అధ్యక్షుడిపై ఓ పోలీసు అధికారే ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం... చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే పోలీసులు పాదయాత్రకు అనుమతులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని.. రకరకాల ఆంక్షలు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులపై అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ కలకలం రేపుతున్నాయి. కేసు కూడా నమోదు చేయడంతో తదుపరి చర్యలు ఏం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.