Rythubandhu Funds: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఆరోజు నుంచే యాసంగి రైతుబంధు సాయం
Rythubandhu Scheme: యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
Rythubandhu Scheme In Telangana: తెలంగాణ రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులు ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి.
పంట పెట్టుబడికి రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సీజన్లలో ఎకరాకు రూ.5000 చొప్పున పంట సాయం అందిస్తోంది. ప్రస్తుతం యాసంగి పంట కాలానికిగానూ 7,600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ప్రతి ఏడాది, ఖరీఫ్ సీజన్ తరహాలోనే మొదట ఒక ఎకరం రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తారు. ఆపై అధిక ఎకరాలు ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రైతు బంధు సాయాన్ని అందిస్తోంది. ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులని తెలిపారు. మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను (Agri Culture Extension Officer) సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది.
రైతు బంధు అర్హుల జాబితాలో మీరు ఉన్నారా..
అధికారిక వెబ్‌సైట్ http://rythubandhu.telangana.gov.in/ వెబ్ సైట్‌కి వెళ్లండి
హోం పేజీలో రైతు బంధు స్కీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ (Cheque Distribution Venue Schedule) మీద క్లిక్ చేయాలి
ఆ తరువాతి పేజీలో మీ జిల్లా (District), మండలం (Mandal) సెలక్ట్ చేసుకుంటే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది
అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది
రైతు బంధు నగదు జమ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్ https://treasury.telangana.gov.in/ కు వెళ్లండి
హోం పేజీ మెనూ బార్‌లో రైతుబంధు స్కీమ్ ఖరీఫ్ డీటైల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి
అనంతరం రైతు బంధు అందుకునే సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి
స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు ఇవ్వాలి
వివరాలు మొత్తం ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతు బంధు నగదు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.
అయితే నేడు రైతులకు నగదు ప్రారంభించారు కనుక మరికొన్ని రోజుల్లో అధికారులు ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు.
ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018, మే 10న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు. తొలిసారిగా ధర్మరాజుపల్లి వాసులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్ పాసు పుస్తకాలు అందుకున్నారు. అప్పటినుంచి రాష్ట్రంలో రైతు బంధు కొనసాగుతుండగా.. నేడు రైతులకు 10వ విడుత నగదు సాయం ప్రారంభించారు.