Nizamabad News: హోలీ రోజు కొట్టుకునే ఆ గ్రామంలో రుచికరమైన అరటి పండుతుంది
నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలోనే అరటి సాగు. లాభాలు గడిస్తున్న హున్సా అరటి రైతులు. 200 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్న హున్సా గ్రామ రైతులు. మహారాష్ట్ర, హైదరాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాలకు ఎగుమతి

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని హున్సా గ్రామం పేరు వినగానే అందరికీ హోలీ రోజు ఆడే పిడిగుద్దులాటే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడి రైతులు అరటి సాగు చేయటంలోనూ ఫేమస్. నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా అరటి పంట సాగు చేయరు. ఒక్క హున్సా గ్రామంలోని రైతులే అరటి పండిస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణకు బార్డర్‌లో హున్సా గ్రామం ఉంటుంది. మంజీరా నది ఒడ్డున ఉండే ఈ గ్రామంలో ప్రధానంగా వరి, చెరుకు, పప్పుదినుసులతోపాటు అరటి తోట సాగు చేస్తారు. జిల్లాలో అరటి తోట సాగు ఎక్కడా చేయరు. కేవలం హున్సాలోనే అరటి తోటలు కనిపిస్తాయ్.
హున్సా గ్రామంలో దాదాపు 200 వందల ఎకరాల్లో రైతులు అరటి తోట సాగు చేస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఇక్కడ అరటి తోటను సాగు చేస్తూ వస్తున్నారు రైతులు. కరోనాతో గత రెండేళ్లు అరటి సాగుతో భారీగా నష్టపోయిన రైతులకు ఈ ఏడాది అరటి సాగుతో వారి కష్టాలు తీరుతున్నాయ్. కరోనాతో రెండేళ్లు అరటి రైతులు నష్టాన్ని చవిచూశారు. ఈసారి అరటి దిగుబడి బాగా పెరగటంతోపాటు ధర కూడా గిట్టుబాటు అవుతోందని హున్సా గ్రామ అరటి రైతులు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా అరటి పండకుండా హున్సా గ్రామంలోనే ఎందుకు సాగు చేస్తారంటే ఈ గ్రామం మంజీరా నది పరివాహకంలో ఉంటుంది. ఇక్కడి నేల అరటి సాగుకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ గ్రామ రైతులు అరటి తోట సాగుచేస్తున్నారు. ఈ అరటి పంట కాలం 12 నుంచి 15 నెలల కాలం. ఈ సమయంలో క్రాఫ్ వస్తుంది. ఈసారి దిగుబడి పెరిగింది. దీంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాకు 1500 నుంచి1800 రూపాయల వరకు ధర పలుకుతోందని అరటి రైతులు చెబుతున్నారు. అరటి తోట సాగుకు ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈసారి ధర గిట్టుబాటు కావటంతో ఎకరాకు రెండున్నర లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తోందని అరటి రైతులు చెబుతున్నారు.
అరటి విత్తనాలను మహారాష్ట్రలోని జల్ గావ్ నుంచి తీసుకొస్తారు. ఎకరాలో 1500 నుంచి 2000 వరకు ప్లాంటేషన్ ఉంటుంది. జీ-9 రకం అరటి తోటను సాగు చేస్తున్నారు. నేరుగా రైతుల వద్దకే వచ్చి వ్యాపారులు అరటిని కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఏడాదికి ఒక క్రాప్ ఉంటుంది. క్రాప్ కట్ చేసిన తర్వాత అంతర్ పంటగా మొక్కజోన్న లేదా ఇతర పంటలను పండిస్తారు. ఒక్కసారి నాటిన అరటి ప్లాంటేషన్ అరటి కాయ వచ్చాక ఆ చెట్టును తీసేసి తిరిగి ప్లాంటేషన్ చేస్తారు. సయమంలో ఎక్కువ తీసుకున్నా... లాభాలు బాగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు హున్సా గ్రామ రైతులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

