Electric Cycle: పెట్రోల్ ధరలకు ఓ నమస్కారం పెట్టి ఈ కరెంట్ సైకిల్ కథ వినండి..!
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు వల్ల చాలా మంది ఎలక్ట్రికల్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ సైకిల్ ను తయారు చేసి ఔరా అనిపించాడు. ఈ సైకిల్ విశేషాలేంటో చదివేయండి.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడైనా సరదాగా బండి బయటకి తీసేవాళ్లు కూడా డ్యూటీకి బస్సుల్లో వెళ్తున్నారంటే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వీటికి ప్రత్యామ్నాయం కోసం ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు.
ఈ బాధలు భరించలేకే తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఓ ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశాడు. ఇది ఒక యూనిట్ కరెంట్ ఛార్జ్ చేస్తే 50 కిమీ నడుస్తుంది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజమేనండి. అసలు ఈ కరెంట్ సైకిల్ కథేంటో ఓ లుక్కేయండి.
ఎంత అయిందో తెలుసా..
తమిళనాడు విల్లుపురంలోని పాకమేడు గ్రామానికి చెందిన ఎస్ భాస్కరన్ మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లోమా చేశాడు. అయితే కొవిడ్-19 కారణంగా అతని ఉద్యోగం పోయింది. ఎలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల వ్యవసాయం చేస్తున్నాడు. కానీ భాస్కరన్ ఆలోచనలు వేరే విధంగా ఉండేవి. ఖాళీ సమయాల్లో ఎలక్ట్రికల్ సైకిల్స్ పై రీసెర్చ్ చేసేవాడు. రూ.2 వేలతో సైకిల్ కొని దానికి కొన్ని పార్ట్స్ జత చేసి ఎలక్ట్రికల్ సైకిల్ గా మార్చాడు. ఈ సైకిల్ తయారు చేయడానికి అతనికి రూ. 20 వేలు ఖర్చు అయింది.
ఏమేం వాడారు..
ఈ సైకిల్ కు ఒక ఎలక్ట్రికల్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్, బ్రేక్ కట్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేశారు. కేవలం ఒక యూనిట్ ఛార్జ్ చేస్తే దాదాపు 50కిమీ పాటు ఈ సైకిల్ నడుస్తుందట. ఒక వేళ ఛార్జింగ్ అయిపోతే సైకిల్ పెడల్స్ తొక్కడం వల్ల కూడా రీఛార్జ్ అవుతుంది. ఈ సైకిల్ మేక్స్ మమ్ స్పీడ్ 30 km/hr.
ఈ సైకిల్ కు త్వ రలోనే పేటెంట్ హక్కులను తీసుకోవాలని భాస్కరన్ అనుకుంటున్నాడు. ఇదే జరిగితే ఒక నూతన ఆవిష్కరణకు అడుగుపడినట్లే. ప్రజలు కూడా పెట్రోల్, డీజిల్ వాహనాలను కాదని ఈ ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సైకిల్ వార్త నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు భాస్కరన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం వైపు నుంచి కూడా సాయం అందించాలని కోరుతున్నారు.
అదే లక్ష్యం..
పరిశోధనల ద్వారా ఆదాయాన్ని సంపాదించడమే తన కలగా భాస్కరన్ చెబుతున్నాడు. ఎప్పటికైనా దివ్యాంగుల కోసం ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ తయారు చేయడమే తన లక్ష్యమని భాస్కరన్ అంటున్నాడు. ప్రభుత్వం తనకు సాయం చేస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని భాస్కరన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.