అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు
ఖమ్మం జిల్లా విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా 22 రోజుల్లో ఏడుగురు హిందీ పండిట్‌లు ఉద్యోగాలు కోల్పోయారు. అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వడంతో పాటు వాళ్లకు పోస్టింగ్‌లు కూడా అయ్యాక ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగించారు. అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్ మెంట్ లెటర్స్ అందాయి. నవంబర్ 6వ తేదీన అంటే..కేవలం 22 రోజుల్లో వాళ్లను అనర్హులుగా ప్రకటిస్తూ విద్యాశాఖ తొలగించడంపై ఆందోళన తలెత్తింది. అన్నీ చూసుకునే ఉద్యోగం ఇచ్చిన తరవాత ఇప్పుడు ఇలా హఠాత్తుగా వెళ్లిపోమంటే ఎక్కడికిపోతామని అభ్యర్థులు వాపోతున్నారు. అటు అధికారులు మాత్రం ఇందులో తమ తప్పు ఉన్నప్పటికీ...అభ్యర్థులు కూడా అప్లై చేసే ముందే క్వాలిఫికేషన్‌ని చెక్ చేసుకోవాలని, అది వాళ్ల బాధ్యత అని తేల్చి చెబుతున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో స్పష్టం చేశారు. కేవలం తమదే తప్పు అన్నట్టుగా మాట్లాడడం సరి కాదని వెల్లడించారు. వాళ్లు అండర్ క్వాలిఫైడ్ కావడం వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.