Sardar Sarvai Papanna Goud | తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లుగీత కార్మికుడు | ABP
మీరు చూస్తున్నది తాటికొండ కోట. ఎత్తైన గుట్టల మీద నిర్మించిన ఈ తాటి కొండ కోట పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఓ సామాన్యూడిగా జన్మించి ఆధిపత్య కులాల అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు పాపన్న. పాపన్న తెలంగాణలో అనేక కోటలను నిర్మించి ఢిల్లీ సుల్తానులను, మొఘలులను సైతం ఎదిరించారు సర్వాయి పాపన్న.ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలుకా ఖిలషాపూర్ లో 1650 ఆగస్టు 18 న జన్మించిన సర్వాయి పాపన్న చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. చిన్ననాటినుంచే ధిక్కార స్వరాన్ని కల్గిన పాపన్న గ్రామాల్లో ప్రజలను పీడిస్తున్న కులవ్యవస్థ, భూస్వాముల పై దాడులు చేయడం ప్రారంభించాడు. పాపన్న తన స్నేహితులైన చాకలి సర్వన్న, మంగళి మసన్న, దూదేకుల పీర్ హుస్సేన్, కుమ్మరి గోవింద్, జక్కుల గోవింద్, మీర్ సాహెబ్ లు మరికొంత మంది స్నేహితులతో కలిసి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా తెలంగాణలోని భూస్వాముల గడీలపై దాడులు చేసి సంపదను దోచుకునేవాడు. ఆ సంపదతో ఖిలాషాపూర్ లో నిర్మించిన కోటను రాజధానిగా ఏర్పాటు చేసుకుని అనేక కోటలను నిర్మించారు. సర్వాయి పాపన్న నిర్మించిన కోటలలో ప్రధానంగా చెప్పుకునేవి రెండు కోటలు. మొదటిది ఖిలాషాపూర్ లో నిర్మించిన కోట ఇదే రాజధాని కూడా. రెండోది తాటికొండలో నిర్మించిన కోట. తాటికొండ కోట సుమారు మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 13 అడుగుల వెడల్పైన కోట గోడలతో నిర్మించారు. సింగిల్ ఎంట్రీ ఉంటుంది లోనికి వెళ్లటానికి. కొండపైన భారీ భవంతులే ఉండేవని ఈ పాడుపడిపోయిన ఆనవాళ్లు చూస్తుంటే అర్థమవుతోంది. పాపన్న తన సామ్రాజ్య రాజధాని ఖిలా షాపూర్ నుండి తాటికొండ కోటకు నిత్యం అటు ఇటు తిరిగేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా తాటికొండ కోట నుంచి కిలా షాపూర్కు సొరంగ మార్గం నేటికీ కనిపిస్తుంది. అంతేకాకుండా బురుజు మధ్యలో పెద్ద బావి సైతం ఇప్పటికీ ఉంది. కోటపైన ఏడు కోనేరులలో నీరు అందుబాటులో లేనప్పుడు ఈ బావి నుండి కొండపైకి నీటిని తీసుకువెళ్లేవారని చెబుతారు.కోట నిర్మించిన విధానం గురించి చాలా గొప్పగా చెబుతుంటారు ఇప్పటికీ ఇక్కడి ప్రజలు.