RCB vs CSK Match Highlights IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్ పై 2 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం | ABP
పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానం కోసం ఓ టీమ్..సొంత గడ్డపై 15ఏళ్ల తర్వాత తమను ఓడించిన టీమ్ ను వాళ్ల సొంత గడ్డపై ఓడించాలనే కసితో మరో టీమ్...ఆర్సీబీ, చెన్నై జట్ల మధ్య జరిగిన ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్ ను మంచి థ్రిల్లర్ ను తలపించింది. మ్యాచ్ చివరి బంతి వరకూ విజయం రెండు జట్ల వైపూ దోబుచూలాడుతూ చివరికీ ఆర్సీబీ నే విక్టరీ వరించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. బెత్ హెల్ బాదుడు
టాస్ గెలిచి ఏ మూహూర్తాన సీఎస్కే బౌలింగ్ అన్నదో తెలియదు కానీ ఆర్సీబీ ఒకటే బాదుడు. తమకు ఈ సీజన్ లో పెద్దగా కలిసి రాని హోం గ్రౌండ్ లో భారీ స్కోరు పెట్టాలని డిసైడ్ అయ్యిందో ఏమో కానీ ఆర్సీబీ ఓపెనర్లు బెత్ హెల్, కొహ్లీ చెన్నై బౌలర్లను రఫ్పాడించారు. ప్రత్యేకించి 21ఏళ్ల కుర్రాడు బెత్ హెల్ అయితే చెన్నై బౌలర్లకు హెల్ అంటే ఏంటో చూపించాడు. 33 బాల్స్ లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన బెత్ హెల్ తను ఆడిన రెండో ఐపీఎల్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు మొదటి వికెట్ కు 97పరుగుల పార్టనర్ షిఫ్ ను జస్ట్ 9 ఓవర్లలో పెట్టేలా చేశాడు.
2. కింగ్ కొహ్లీ విధ్వంసం
ఒక్క సారి ఫామ్ లోకి వస్తే తనను ఎవ్వరూ ఆపలేరన్నట్లు ఈ సీజన్ లో చెలరేగిపోతున్న కింగ్ కొహ్లీ మరో మారు తన జోరు చూపించాడు. బెత్ హెల్ ఆడినట్లే 33 బాల్సే ఆడిన కొహ్లీ 5 ఫోర్లు 5 సిక్సర్లతో 62 పరుగులు చేసిన కొహ్లీ ఆర్సీబీ కి భారీ స్కోరుకు బాటలు వేయటంతో పాటు సీజన్ లో ఎవ్వరికీ అందని స్థాయిలో ఏడో హాఫ్ సెంచరీ సాధించి ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ నుంచి తిరిగి సొంతం చేసుకున్నాడు.
3. రొమారియో షెపర్డ్ బౌండరీల జాతర
కొహ్లీ అవుట్ అయ్యేప్పటకి ఆర్సీబీ స్కోరు 12 ఓవర్లలో 121. కానీ అక్కడి నుంచి ఆర్సీబీ స్కోరు మందగించింది. ఓ దశలో 17ఓవర్ ముగిసే టైమ్ కి 157పరుగులే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో రొమారియో షెపర్డ్ కళ్లు చెదిరే హిట్టింగ్ చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో పెను విధ్వంసం చేశాడు. ముందు 19ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ ను టార్గెట్ చేసి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సిక్స్, సిక్స్, ఫోర్, సిక్స్, సిక్స్, ఫోర్ అంటూ ఓవరంతా విధ్వంసం చేసి 33 పరుగులు రాబట్టాడు షెపర్డ్. ఆ తర్వాత ఆఖరి ఓవర్ వేసిన పతిరానా నుంచి రెండు సిక్సులు రెండు ఫోర్లతో 20పరుగులు రాబట్టి కేవలం 14 బంతుల్లోనే 4ఫోర్లు 6 సిక్సర్లతో 53పరుగులు చేసి ఆర్సీబీని ఊహించని రీతిలో 200 పరుగులు దాటించి..చెన్నైకి 214పరుగుల టార్గెట్ పెట్టాడు షెపర్డ్. ఆఖరి ఓవర్ లో 20 పరుగులు ఇచ్చినా అంతకు ముందు బాగా బౌలింగ్ చేసిన పతిరానా 3 వికెట్లు తీశాడు.
4. ఆయుష్ అణువిస్ఫోటనం మాత్రే
సీజన్ అంతా పరాజయాలు అసలు 180పైగా పరుగులు ఛేజ్ చేసిందే ఇటీవలి కాలంలో చెన్నైకి లేదు. అయినా చెన్నై ఓపెనర్ 17ఏళ్ల టీనేజర్ ఆయుష్ మాత్రమే అదురు బెదురు లేకుండా ఆడాడు. ముందు షేక్ రషీద్ తర్వాత జడేజా తో కలిసి బౌండరీల మోత మోగించాడు మాత్రే. అణువిస్ఫోటనం లా మారి 48 బాల్స్ లో 9 ఫోర్లు 5 సిక్సర్లతో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. సిక్సర్ తో సెంచరీ చేద్దామని భావించి పాపం ఫస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నాడు అద్భుతంగా ఆడాడు ఆయుష్ మాత్రే.
5. జడ్డూ కేక బ్యాటింగ్...కానీ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్
శామ్ కర్రన్ అవుట్ అవటంతో టూడౌన్ లో బ్యాటింగ్ కి దిగిన జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మాత్రే తో సమానంగా బౌండరీలు బాదిన జడ్డూ 109 మీటర్ల భారీ సిక్సర్ కూడా కొట్టి..45 బంతుల్లో 8ఫోర్లు 2సిక్సర్లతో 77పరుగులు చేయటం ద్వారా తన బ్యాటింగ్ ఎబిలిటీస్ ను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ చివరి ఓవర్ లో 15పరుగులు కొట్టాలనన్నప్పుడు రెండు సింగిల్స్ రావటం..ధోనీ అవుట్ అవ్వటంతో మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వచ్చేసింది. బట్ అక్కడితో అయిపోలేదన్నట్లు దూబే వచ్చి రాగానే సిక్స్ కొట్టడం..అది నో బాల్ కావటంతో చెన్నైకి మళ్లీ కలిసి వచ్చింది. ఇక ఆఖరి బంతికి ఫోరు కొడితేనే చెన్నై గెలుస్తుంది అన్నప్పుడూ దూబే బాదినా సింగిలే రావటంతో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో సంచలనం విజయం సాధించింది. జడ్డూ నాటౌట్ గా ఉన్నా అంత మంచి ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు.
క్యాచ్ లు వదిలేసినా మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ ఈ విజయంతో 16పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానానికి చేరుకోగా….9వ మ్యాచ్ ఓడిన చెన్నై ఆఖరి స్థానంలో కంఫర్ట్ బుల్ గా సెటిల్ అయ్యింది.





















