PBKS vs MI Qualifier 2 Match Highlights IPL 2025 | ముంబైపై 5వికెట్ల తేడాతో ఘన విజయం
ఐదు సార్లు ఐపీఎల్ విజేత ముంబై ఊహించి కూడా ఉండదు. ఈ రేంజ్ లో పంజాబ్ కింగ్స్ ప్రతిఘటిస్తుంది. ముందు టాస్ గెలిచి ముంబైని బ్యాటింగ్ కి రమ్మనటమే ఓ సాహసం. జోరుగా వర్షం కురవటంతో గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో అదృష్టం కొద్దీ ఓవర్లు ఏం నష్టపోలేదు కానీ ముంబైకి పంజాబ్ బ్యాటింగ్ ఎందుకు అప్పగించిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. బంతి సీమ్ కు అస్సలు అనుకూలించకపోవటంతో ముంబై బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. పంజాబ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రోహిత్ ను 8పరుగులకే అవుట్ చేసినా బెయిర్ స్టో, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ పంజాబ్ బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించారు. బెయిర్ స్టో 38, తిలక్ 44, సూర్య కుమార్ యాదవ్ కూడా 44పరుగులే చేశారు. అయితే వరుస ఓవర్లలో తిలక్, సూర్య అవుట్ అవ్వటంతో పంజాబ్ మళ్లీ మ్యాచ్ లోకి వచ్చింది. అయితే చివర్లో నమన్ ధీర్ 18 బాల్స్ లోనే 37పరుగులు చేయటంతో ముంబై 203పరుగుల భారీ స్కోరు చేసింది. ఇప్పటివరకూ ముంబై చరిత్రలో 200పరుగులకు పైన కొట్టిన ప్రతీసారి ముంబై ఢిపెండ్ చేసుకుంది. సో అదే ధైర్యంతో బౌలింగ్ కి దిగిన ముంబైపై పంజాబ్ బ్యాటర్లు ఊహించటానికి వీలు లేకుండా విరుచుకుపడ్డారు. ప్రభ్ సిమ్రన్, ప్రియాంశ్ ఆర్యను పవర్ ప్లేలోపే అవుట్ చేశామన్న ఆనందం ముంబైకి ఉన్నా జోస్ ఇంగ్లిస్ దుమ్ము రేపాడు. 21 బంతుల్లోనే 5ఫోర్లు 2 సిక్సర్లతో 38పరుగులు చేసి అవుటయ్యాడు జోస్ ఇంగ్లిస్. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విజృంభణ మొదలైంది. నేహాల్ వధేరా ను పెట్టుకుని ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు అయ్యర్. నేహల్ వధేరా 29 బాల్స్ లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో 48పరుగులు చేశాడు వధేరా. కానీ అయ్యర్ మాత్రం 41 బాల్స్ లో 5ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 87పరుగులు చేసి మ్యాచ్ లో ముంబై పతనాన్ని శాసించాడు. ఎంత మంది బౌలర్లను పాండ్యా మార్చినా అయ్యర్ ను ఆపలేకపోయారు. ఆకాశమే హద్దుగా అయ్యర్ కొట్టి సిక్సర్లతో 204పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే అందుకుంది పంజాబ్. ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించటంతో పాటు ఐపీఎల్ ఫైనల్ కు 11ఏళ్ల దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్.



















