ఒరే ఆజామూ.. 1000 రోజులైందిరా!
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబార్ ఆజమ్‌ని పాక్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘1000 రోజుల నుంచి పరమ చెత్త ఆటతో దారుణంగా ఫెయిల్ అవుతున్నావ్.. వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేయ్’ అంటూ.. సోషల్ మీడియాలో బాబర్‌ని ఓ ఆట ఆడుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. సౌతాఫ్రికాతో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో బాబర్ ఆజామ్ 16 రన్స్ మాత్రమే చేసి అవుటయ్యాడు.
అంతకుముందు లాహోర్‌లో జరిగిన తొలి టెస్ట్‌లోనూ 23, 42 పరుగులతో ఫెయిలయ్యాడు. ఇప్పటికే చెత్త ఆటతో వైట్ బాల్ ఫార్మాట్‌లో టీమ్‌లో చోటు కోల్పోయిన బాబర్.. కేవలం రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఫార్మాట్‌లోనూ బాబర్ ఇప్పుడు దారుణంగా ఫెయిల్ అవుతుండటంతో మనోడిపై ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంటోంది. టెస్టుల్లో ఆల్రెడీ మూడేళ్లుగా సెంచరీ లేదు.
చివరిగా 2022లో న్యూజిల్యాండ్‌పై కరాచీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 161 రన్స్ చేశాడు. అదే బాబర్ ఆఖరి టెస్ట్ సెంచరీ. అక్కడి నుంచి 1030 రోజులుగా.. 28 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్.. ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అంతేకాదు.. ఈ 28 ఇన్నింగ్స్‌ల్లో 24 యావరేజ్‌తో మూడంటే మూడే హాఫ్ సెంచరీలు బాది.. 651 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో బాబర్ రిటైర్మెంట్ ఇచ్చేయాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.





















