India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లు
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడతాయని చాలా మంది అనుకుని ఉండరు. భారత్, సౌతాఫ్రికా రెండు జట్లు కూడా ఓటమి లేకుండా ఈ ఫైనల్ వరకూ దూసుకువచ్చాయి. సౌతాఫ్రికా ఓ ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతుండటం ఇదే మొదటిసారి కాగా...భారత్ కు ఐసీసీ ఈవెంట్స్ లో ఫైనల్ ఆడటం ఇది 13వసారి. ఆస్ట్రేలియా పేరు మీద మాత్రమే ఇన్నాళ్లూ ఉన్న ఈ అత్యధిక ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ రికార్డు భారత్ నిన్న ఇంగ్లండ్ పై విజయంతో సమం చేసింది. అయితే టీ20 వరల్డ్ కప్పును భారత్ గెలిచింది కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా 2007లో. టీ2౦ వరల్డ్ కప్ ను మొదలు పెట్టిన ఆ ఏడాదే ఫస్ట్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోని అనే కెప్టెన్ భారత్ కోసం పుట్టుకొచ్చింది అక్కడి నుంచే. ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ భారత్ మరో కప్పును ముద్దాడలేదు. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన...2023 వన్డే వరల్డ్ కప్ ను ఫైనల్లో ఆస్ట్రేలియాకు కోల్పోయింది. తిరిగి ఏడాది గ్యాప్ లో ఇప్పుడు మరో ఐసీసీ ఈవెంట్ లో ఫైనల్ కు చేరుకోవటం ద్వారా భారత్ ఈసారైనా ట్రోఫీ అందుకోవాలనే కసితో ఉంది. ధోని తర్వాత టీ20ల్లో వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఘనత సాధించాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అయితే సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయలేం. ఆ టీమ్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సార్లు సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. చోక్ అయిపోవటమే...ఎక్కడ లేని దురదృష్టం వెంటాడమో ఇన్నేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న సౌతాఫ్రికా తొలిసారి ఓ ఐసీసీ ఈవెంట్ ఫైనల్ ఆడుతోంది. సో మనకంటే సౌతాఫ్రికా మరింత పట్టుదలతో సౌతాఫ్రికా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఓపెనర్ డికాక్, మార్ క్రమ్, క్లాసెన్ లాంటి బ్యాటర్లు రబాడా, మార్కో జాన్సన్, షంసీ, కేశవ్ మహరాజ్ లాంటి బౌలర్లే ఆయుధంగా సౌతాఫ్రికా తమ శక్తి మేర భారత్ ను ఢీ కొట్టడం ఖాయం. మరి ఈ రెండు కొదమసింహాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే శనివారం రాత్రి 8 గంటలకు బార్బడోస్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.