Eng vs Ind First test Highlights | హెడింగ్లే టెస్టులో అనూహ్యంగా ఓడిపోయిన టీమిండియా | ABP Desam
అస్సలు ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. లీడ్స్ లోని హెడింగ్లేలో ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్టును టీమిండియా చేజార్చుకుంటుందని. ఎందు కంటే కుర్ర జట్టైనా మేటి ఇంగ్లండ్ ను వాళ్ల సొంత గడ్డపై నే రఫ్పాడించింది టీమిండియా. ఒకటి కాదు రెండు కాదు రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఐదు సెంచరీలు బాదారు భారత బ్యాటర్లు. ఒక్క పంతే రెండు సెంచరీ లు కొట్టాడు. గిల్, రాహుల్, జైశ్వాల్ కూడా సెంచరీలు చేశారు. భారీస్కోర్లు పెట్టారు. భారీ టార్గెట్ కూడా ఇచ్చారు. అయినా కొట్టేశారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు బాజ్ బాల్ రుచి చూపిస్తాం అని. అన్నట్లు గా నే చెవులు మూసి చావగొట్టేశారు. 371 పరుగుల టార్గెట్ లో ఆఖరి రోజు కొట్టాల్సిన 350 పరుగులను ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేజ్ చేసేశారు. ప్రధానంగా ఇంగ్లీష్ ఓపెనర్ బెన్ డకెట్ కొరకరాని కొయ్యలా మారి మన విజయవకాశాలను దారుణంగా దెబ్బ తీశాడు. మహానుభావుడు జైశ్వాల్ సెంచరీ ముందు క్యాచ్ వదిలేయటంతో బతికిపోయిన డకెట్ ఏకంగా 149పరుగులు కొట్టి ఒంటి చేత్తో ఇంగ్లండ్ కు అనూహ్య విజయాన్ని అందించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన బుమ్రా భాయ్ రెండో ఇన్నింగ్స్ లో విఫలం అవ్వటంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టులో ఆటగాళ్లు ఐదు సెంచరీలు చేసి మ్యాచ్ ఓడిపోవటం ఇదే తొలిసారి. అంత అద్భుతమైన రికార్డు మనోళ్ల ఖాతాలోకి వచ్చి చేరింది.





















