Bowler Akash Deep Cricket Story | కన్నీళ్లు తెప్పిస్తున్న ఆకాష్ దీప్ క్రికెట్ జర్నీ
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో అందరి కన్నా ఎక్కువ వినిపిస్తున్న పేరు యువపేసర్ ఆకాశ్‌దీప్. టీం ఇండియా గెలిచిన ఈ చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. దాంతో ఎక్కడ చూసిన ఆకాష్ దీప్ పేరు మారు మ్రోగిపోతుంది. కానీ ఈ విజయం ఆకాశ్ దీప్‌కు అంత ఈజీగా రాలేదు. జీవితంలో ప్రతి సారి తనకు ఎదురైన విషాదాల నుంచి బయటకి వస్తూ తన కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు.
బిహార్‌లోని ససారామ్‌కు చెందిన ఆకాశ్ దీప్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆడాలని ఉండేది. కానీ బీహార్ లో అవకాశాలు లేవని గ్రహించి 2010లో ఉద్యోగం కోసం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ వెళ్లాడు. అక్కడ తన మామ నుంచి ఆకాశ్ దీప్‌కు సపోర్ట్ లభించింది.
ఆలా పేసర్ గా తన ప్రయాణం మొదలు పెట్టాడు. క్రికెట్ లో ఇంకా తన కెరీర్ మొదలు పెట్టకముందే ఆకాష్ దీప్ 2015లో తండ్రిని కోల్పోయాడు. రెండు నెలలకే తన అన్న చనిపోయారు. కేవలం రెండే నెలల్లో తన సొంత మనుషులను కోల్పోవడంతో ఆకాశ్ దీప్ మానసికంగా కుంగిపోయాడు. మరోవైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతుండడంతో ఇంటి పెద్దగా కుటుంబాన్ని చూసుకునే బాధ్యత అతడిపై పడింది. దాంతో మూడేళ్లపాటు ఆటకు దూరం అయ్యాడు.
తండ్రి, అన్న మరణాల నుంచి కుటుంబం కాస్త తేరుకున్న తర్వాత ఆకాశ్ దీప్ 2018లో మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కోల్‌కతాలోని యునైటెడ్ క్లబ్ నుంచి CAB సెకండ్ డివిజన్ లీగ్‌లో మళ్లీ ఆడటం ప్రారంభించాడు. అక్కడే మహమ్మద్ షమీ పరిచయం అయ్యాడు. షమీ సహకారంతో తన బౌలింగ్ స్కిల్స్ ని మెరుగుపరుచుకున్నాడు. బెంగాల్ అండర్-23 నుంచి సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2019-20 సీజన్లో రంజీ ట్రోఫీలో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల తర్వాత బెంగాల్ టీం రంజీ ట్రోఫీ కల నెరవేరడంలో ఆకాశ్ దీప్ కీలక పాత్ర పోషించారు. 2021లో రాయల్ ఛాలెంజర్స్ ఆకాశ్‌ను సెలెక్ట్ చేసింది. ఇలా దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ... ఎన్ని సమస్యలు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆకాష్ దీప్ ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు టీం ఇండియా గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. తన తండ్రిని కోల్పోయి... కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కొని... క్రికెట్ నే జీవితంగా చేసుకొని ముందుకు సాగిన ఆకాష్ దీప్ జర్నీ ఎంతోమందికి ప్రేరణ అవుతుంది.





















