(Source: ECI/ABP News/ABP Majha)
అంతర్జాతీయ టీ20ల్లో అభిషేక్ మాస్ రికార్డు - ఇండియన్స్ ఎవరి వల్లా కానిది!
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా డాషింగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు. ఒకే టీ20 సిరీస్‌లో సెంచరీ చేయడంతో పాటు వికెట్ కూడా తీసుకున్న మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో ఈ రికార్డును 1933లో లాలా అమర్‌నాథ్ సాధించాడు. ఇక వన్డేల విషయానికి వస్తే... 1983లో కపిల్ దేవ్ ఈ ఫస్ట్ రికార్డును సాధించారు. ఇప్పుడు టీ20ల్లో ఈ రికార్డును అభిషేక్ శర్మ సాధించాడు. ఈ సిరీస్ అభిషేక్ శర్మకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. మొదటి టీ20లో డకౌట్ అయినప్పటికీ రెండో టీ20లో 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మూడో టీ20లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 10 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు కానీ బౌలింగ్‌లో మాత్రం ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈరోజు సాయంత్రం జింబాబ్వేతో భారత్ ఆఖరి టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. మరి ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఎలా ఆడతాడో చూడాలి!