Ramoji Rao Passed Away | రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు కన్నుమూత
మీడియా దిగ్గజం, తెలుగురాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచుతులైన రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం 4.50 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఈనాడు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ గా ఉన్న రామోజీ రావు..ఈనెల 5న గుండె సంబంధిత సమస్యలతో హైదారాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి క్రిటికల్ సిచ్యుయేషన్ లో చికిత్స పొందుతున్న తెల్లవారుజామున కన్నుమూసినట్లు ఈనాడు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలోని రామోజీ నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. 1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడి అనే చిన్నగ్రామంలో జన్మించిన రామోజీరావు...వ్యవసాయ కుటుంబానికి నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. అన్నదాత, మార్గదర్శి, ఈనాడు పత్రికలతో ఆయన తెలుగు వారందరికీ దగ్గరయ్యారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంతో రామోజీరావు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈటీవీ నెట్ వర్క్, కళాంజలి, ప్రియాఫుడ్స్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఉషాకిరణ్ మూవీస్ తో పలురంగాల్లోకి ప్రవేశించిన రామోజీ ప్రతీ చోట విజయవంతమయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు సుమన్ 2012లో మృతి చెందారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై 58 సినిమాలను నిర్మించిన రామోజీరావు కీరవాణి, తరుణ్, విజయ్ దేవరకొండ లాంటి వారికి సినిమా ఇండస్ట్ర్లీలో తొలి అవకాశాలను అందించారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు