Raghavendra Rao Emotional | రామోజీరావు భౌతిక కాయం వద్ద రాఘవేంద్రరావు భావోద్వేగం
రామోజీ రావు పార్ధిక దేహం వద్ద డైరెక్టర్ రాఘవేంద్ర రావు భావోద్వేగానికి లోనయ్యారు. దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలుగు పత్రికలు అంటే ఈనాడు ముందు ఈనాడు తర్వాత అని విశ్లేషించవచ్చు. ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సృష్టించిన సంచలనాలు అలాంటివి.తొలుత వార్తాపత్రికలు మరుసటి రోజు వచ్చేవి. ఆ తర్వాత దాన్ని మధ్యాహ్నానికి తీసుకురాగలిగారు. కానీ పేపర్ అంటే అది తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఇంటి గుమ్మం ఉండాలనే ఒకే ఒక్క ఆలోచనలతో రామోజీరావు తెలుగు మీడియా రంగంలో సంచలనాలు సృష్టించారు. 1974లో విశాఖపట్నంలో కేవలం 5వేల కాపీలతో ప్రారంభమైన ఈనాడు టార్గెట్ ఒక్కటే. ఉషోదయానికి ముందే ఈనాడు ఉండాలి. అది పాఠకులకు విపరీతంగా నచ్చేసింది. తెల్లవారు జామునే లేచేసరికి ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోగలగటం పాఠకులను ఈనాడు పత్రికకు దగ్గర చేసింది. ఆంధ్ర అనే శబ్దంతో మొదలైన పత్రికలు ఎక్కువగా ఉండే రోజుల్లో ఈనాడు అని తెలుగు పేరు పెట్టిన రామోజీరావు..ఫాంట్ లోనూ పబ్లికేషన్ ప్లేసుల్లోనూ సరికొత్తకు తెరతీశారు. జిల్లాకు ప్రత్యేకంగా పత్రికలను తీసుకురావటం ఈనాడుకు మరింత మందిని దగ్గరయ్యేలా చేసింది. కార్టూన్లు, మహిళకు ప్రత్యేక పేజీలు, రైతుల కోసం స్పెషల్ కాలమ్స్ అన్నీ కలిసి ఈనాడు పేరును ఓ బ్రాండ్ గా మార్చారు రామోజీ రావు. ఆయన పత్రికలో తెలుగుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. తెలుగు వాళ్ల జీవితంలోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలనే వాడమని రామోజీ రావు ఆయన పాత్రికేయులకు సూచించేవారు.