Operation Sindoor Explained in Telugu | వేచి చూసి పులిలా పంజా విసిరిన భారత సైన్యం | ABP Desam
పహల్గాంలో ఉగ్రదాడులు జరిగి 15రోజులు అవుతోంది. ఈసారి మేం కొట్టే దెబ్బ మాములుగా ఉండదని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే బహిరంగంగా ప్రకటించినా ఏంటీ మన సైన్యం దూకుడు చూపించ లేదు అనుకుంటున్న వాళ్ల గుండెలు అదిరిపడేలా..నువ్వు ఒక్క చోట దాడి చేస్తే నేను ఒకేసారి తొమ్మిది చోట్ల దాడి చేస్తా దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లు పాక్ ప్రేరిపిత ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది భారత సైన్యం. అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా భారత సైన్యం నిర్వహించిన ఈ ఆపరేషన్ కే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. భరత మాత నుదుటున ఉండే సింధూరాన్ని తాకే ప్రయత్నం చేస్తే మన కొట్టే చావు దెబ్బ ఏ రేంజ్ లో ఉంటుందో పాక్ అండ చూసుకుని రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు, ఉగ్రవాదుల మాటున నక్కి వినోదం చూస్తున్న పాకిస్థాన్ కు ఏకకాలంలో అర్థమయ్యేలా భారత నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మూడు కలిసి ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఆయా విభాగాలకు ఉండే ఎయిర్ ఫోర్స్ బలగాలను పాక్ ఆక్రమిత కశ్మీర్, జమ్ముకశ్మీర్, పాకిస్థాన్ లో ని 9 వేర్వేరు ప్రాంతాలకు పంపించి శత్రువును మన ఉనికిని కనుక్కునే లోపే మొత్తం నేల మట్టం చేసి వచ్చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ముజఫరబాద్, కోట్లీ, గుల్పూర్, బీమ్ బేర్, సరిహద్దుల్లోని సియాల్ కోట్, ముర్దికే, చక్ అమ్రు, ఏకంగా పాకిస్థాన్ లోకి చొచ్చుకెళ్లి భవాల్ పూర్ ప్రాంతాల్లోని ఉగ్రశిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది భారత్. వీటితో పాటు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పూంచ్ రౌజరీ సెక్టార్లలో వేర్వేరు చోట్ల ఏక కాలంలో సైన్యం ఉగ్రవాద స్థావరాలపై కాల్పులు జరిపింది. మొత్తంగా ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని, వారి భవనాలు, స్థావరాలు అన్నీ నేలమట్టం అయ్యాయని వార్తలు వస్తున్నా ఏ అలాంటిది లేదు మా వాళ్లకు ఏం కాలేదు..ఐదు చోట్ల మాత్రం భారత సైన్యం దాడి చేసింది మేం బదులు ఇస్తాం అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మనం కొట్టిన చావుదెబ్బను కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.





















