Sirivennela: రాసిరాసి అలసిపోయావా.. లేక అంత అలుసైపోయామా..సీతారాముడూ ఎక్కడికెళ్లిపోయావ్..!
మాట మూగబోయింది.. రాత ఆగిపోయింది..
సీతారాముడా.. ఎందుకంత తొందర..
రాసిరాసి అలసిపోయావా.. లేక అంత అలుసైపోయామా..
నీ పాట చూసే కదా మాటలు రాయడం నేర్చుకున్నా..
'నిగ్గదీసి అడగమన్నావ్' కదా.. అడుగుతున్నా ఎక్కడికి వెళ్లావయా..
తెలుగు పాటకు తెలియదా నీ విలువ..
ఎక్కడి వెళ్లావో చెప్పవా..
అనుకున్న వాళ్లని అనాథలను చేసేశావు..
నా లాంటి వాళ్లను శూన్యంలోకి తోసేశావు..
కోపంగా ఉంది రాముడు..
ఎవరిపైన చూపను.. ఏమని చెప్పను..
నీ పాటను గుండెల్లో పెటుకున్నాను.. అదే గుండెను బాధ పిండేస్తోంది..
నీ మాటను మనసులో పెట్టుకున్నాను.. అదే పాట చేయి పట్టుకుని ఇన్నాళ్లు నడిచాను..
రాత్రి బజ్జునేటప్పుడు నాకు జోల పాడింది నీ పాట..
నేను ఒంటిరినైనప్పుడు తోడుంది నీ మాట..
ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమిని అన్నావ్ కదయ్యా..
ఎక్కడికి తప్పుకున్నావ్ ఇప్పుడు..
ఇంత బాధపెడతావా..
తెలుగు పాటను చీకటి నుంచి వెలుగులోకి నడింపించావ్ కదా...
ఇప్పుడు ఈ చీకట్లోకి నెట్టేస్తావా..
జాలి లేదా మా పైనా.. వస్తావా రావా..
జగమంత కుటుంబం నీ కోసం ఎదురుచూస్తోంది..
మా నుంచి దూరమైపోయావ్ కదా..
కలం కన్నీరు కారుస్తోంది...
మాట మూగబోయింది...
పాట ఆగిపోయింది...
సీతారాముడా.... వెళ్లిరావయ్యా...