Ghaati Movie Review Telugu | Anushka Shetty తో కూడా తలనొప్పి తెప్పించొచ్చా.? | ABP Desam
పాద ఘట్టం...పాద ఘట్టం..పాద ఘట్టం...ఈ పేరును గుర్తుంచుకోని తెలుగు సినిమా అభిమాని ఉండడు. ఆచార్య సినిమాలో ఆ పేరు అన్ని సార్లు వినపడుతుంది. అచ్చం అలానే ఇప్పుడు ఘాటీ సినిమా. సరే ఈ సినిమా తూర్పు కనుమల గురించి అక్కడ నివసించే ఓకే ఘాటీల గురించి. కానీ ఎన్నిసార్లు వినిపిస్తుందో సినిమాలో. ఘాటీ..ఘాటీ..ఘాటీలు..ఘాటీగాళ్లు...ఆపండ్రా బాబో అని తలపట్టుకోవాలి మనం.
అసలు ఈ సినిమాకు ఉన్న కాస్త హైపైనా రావటానికి ప్రధాన కారణం ఇద్దరే ఒకరు డైరెక్టర్ క్రిష్ ఇంకొకరు దేవసేన అనుష్క శెట్టి. బలమైన భావోద్వేగాలున్న కథలు తీయటంలో క్రిష్ ను కొట్టేటోళ్లు లేరు...క్యారెక్టర్ లో దమ్ముండాలే కానీ సింగిల్ హ్యాండ్ తో సినిమాను నడిపించగల సత్తా ఉన్న అనుష్క శెట్టి యాక్టింగ్ కి వంక పెట్టేటోళ్లు లేరు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వేదం సినిమా విడుదలైన పదిహేనేళ్ల తర్వాత మళ్లీ వచ్చిన సినిమా ఇదే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కాంబో సెట్ అయ్యిందంటే కొంచెం ఎక్సపెక్ట్ చేసి వెళ్లిన ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది ఘాటీ.
కథ బలమైన కథలానే ఉంటుంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉండే తూర్పు కనుమల్లో నివసించే ఘాటీల కథ. అక్కడ పండే శీలావతి రకం గంజాయిని అక్రమ మార్గాల్లో తరలించే స్మగ్లర్ గ్యాంగ్స్... స్థానికులైన ఘాటీలతో గంజాయి మూటలు మోయిస్తూ వందలు వేల కోట్లు దండుకునే కథ. అలాంటి ఏరియా నుంచి వచ్చిన బస్ కండక్టర్ శీలావతి...ఆమె పెళ్లి చేసుకోవాలనుకునే ల్యాబ్ టెక్నీషియన్ దేశిరాజుల కథ ఈ ఘాటీ సినిమా.
సినిమా ప్రారంభం బాగానే ఉన్నా కథలోకి వెళ్లే కొద్దీ కళ్ల ముందు సీన్స్ మారిపోతూనే ఉంటాయి కానీ కథలో లీనమయ్యే ఎమోషన్స్ ను రాబట్టడంతో క్రిష్ ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. రొటీన్ రొట్ట రివేంజ్ డ్రామా లైన్ తో చింతకింది శ్రీనివాస్ రాసుకున్న కథకు కంప్లీట్ గా అయితే జస్టిఫికేషన్ జరగలేదు స్క్రీన్ పై. రైటర్ సాయి మాధవ్ బుర్రా, డైరెక్టర్ క్రిష్ లది క్రేజీ కాంబినేషన్. గతంలో కృష్ణంవందే జగద్గురుం, కంచె సినిమాల్లో మంచి డైలాగులు పేలతాయి కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటివి వినపడవు...ఒకటి రెండు వినపడినా అవి గుర్తుండవు కూడా.
ప్రధానంగా శీలావతి గా అనుష్కతో కావాల్సినంత యాక్షన్ చేయించారు. దేశిరాజు గా విక్రమ్ ప్రభు కూడా ఆకట్టుకుంటాడు. కానీ ఎక్కడా ఎమోషనల్ గా వాళ్ల బాధతో ఆడియెన్స్ ని కనెక్ట్ చేసే పాయింట్స్ ఉండవు సినిమాలో. ఎక్కడ స్క్రీన్ ప్లే లెవల్లోనే తన్నే సింది కథ. విలన్స్ కాష్టాల నాయుడు, కుందుల నాయుడుగా రవీంద్ర విజయ్, చైతన్య ఫర్వాలేదనిపిస్తారు కానీ చాలా చోట్ల వాళ్లు కూడా ఓవర్ ది బోర్డ్ వెళ్లిపోయారు యాక్టింగ్ లో. అరుపులు, గోల, రక్తం తప్ప దానికో బలమైన జస్టిఫికేషన్ లేదు సినిమాలో.
అసలు గంజాయి ఎందుకు అమ్మాలనుకున్నారు..దానికి వీళ్లేసుకున్న ప్లాన్ ఏంటీ..దాన్ని ఎవడో వచ్చి బెదిరిస్తే వీళ్లు బెదిరిపోవటం ఏంటీ..ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్స్...తిరిగి దీనంతటికి గంజాయి మంచిది కాదు వద్దు అనే సామాజిక సందేశం అన్నీ అతికించటానికి ట్రై చేసినట్లు ఉంది తప్ప ఘాటీ సినిమా ఎక్కడా ఆర్గానిక్ గా అయితే అనిపించ లేదు. హరిహర వీరమల్లు లాంటి ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయిన క్రిష్..ఘాటీతో కసిగా కమ్ బ్యాక్ ఇస్తారనుకుంటే ఈ సినిమా కూడా అన్ ఫార్చునేట్లీ హ్యూజ్ లీ డిస్సపాయింట్ చేస్తుంది. బట్ కాటేరమ్మకొడుకు లా ప్రభాస్ కి ఎలా అయితే సలార్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందో..అలానే ఘాటీలో అనుష్క చేసే ఓ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం కచ్చితంగా సలార్ సినిమాను ప్రభాస్ ను గుర్తు చేస్తుంది. ఆ డిజైన్ కూడా అలానే ఉంటుంది. మరి అనుష్కను కాటేరమ్మ కోడలు అనాలేమో.





















