Chiranjeevi Met his Adoni Fan | తన అభిమాని పిల్లల్ని చదివిస్తానని మాటిచ్చిన చిరంజీవి | ABP Desam
మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆదోని నుంచి సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్ కు వచ్చిన మహిళ అభిమానిని చిరంజీవి స్వయంగా కలిశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ లకు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండగా రాజేశ్వరి అనే అభిమాని సైకిల్ యాత్ర చేసుకుంటూ ఆదోని నుంచి హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఆమె అభిమానానికి కదిలిపోయారు. ఇద్దరు పిల్లల ఆ తల్లి తనపై చూపించిన అభిమానికి గుర్తుగా తనతో రాఖీ కట్టించుకున్న మెగాస్టార్ ఆమెకు చీరను బహుమతిగా ఇచ్చి..తండ్రి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆమె పిల్లల్ని తనే చదివిస్తానని హామీ ఇచ్చారు. ఊహించని ఆ బహుమతికి కదిలిపోయిన రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకున్నారు. థాంక్యూ సర్ అంటూ చిరంజీవి అందిస్తానన్న సాయానికి ధన్యవాదాలు తెలిపారు. పిల్లల చదువు కోసమే తాపత్రయపడ్డానని..మెగా ఫ్యామిలీ కి ఎప్పటికీ అభిమానిగానే ఉంటానంటూ మెగా స్టార్ చిరంజీవితో తన బాధను పంచుకున్నారు రాజేశ్వరి.





















