YS Jagan Rappa Rappa Dialogue Controversy | మీరు మారరా..? ఇవేం మాటలు జగన్ సార్..? | ABP Desam
గురువారం సుదీర్ఘంగా సాగిన ప్రెస్‌మీట్‌లో వైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలామందికి షాక్ ఇచ్చాయి. ఎదుటి పార్టీ వాళ్లని నరికేస్తామంటూ ఓ కార్యకర్త.. చేసిన కామెంట్లను ఆయన సమర్థించారు.. తప్పేంటని ప్ర్రశ్నించారు.
గంగమ్మ జాతరలో వేటలను నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం.. ఆ మధ్యెప్పుడో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. నిన్న జగన్ మోహనరెడ్డి పర్యటనలో ఫ్లెక్సీల్లో చూశాం.. మళ్లీ ఇవాళ అదే జగన్ మోహనరెడ్డి చెబితే కూడా విన్నాం. ఆయన చెప్పిన డైలాగులు.. తమ కార్యకర్తలకు, హార్డ్‌కోర్ అభిమానలకు ఊపునిస్తుందేమో కానీ.. మామూలు జనానికి మాత్రం ఆయన స్థాయికి తగనిది అనిపించింది. వైసీపీలో కూడా కొంతమంది ఇక మీరు మారరా.. జగన్ సార్ అంటూ ప్రశ్నించడం కనిపించింది.
రప్పరప్ప నరుకుతా అంటే తప్పేంటి..?
ఏడాది కిందట చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం పల్నాడు పరామర్శ యాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్ రేపు సినిమా చూపిస్తానంటూ.. అక్కడ వ్యాఖ్యలు చేశారు. అన్నట్లుగానే ఆయన ఇవాళ సినిమా చూపించేశారు. ఓ సినిమా అంతసేపు సాగిన రెండు గంటల ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్‌లా అభినయం కూడా చేశారు. రప్ప.. రప్పమని నరుకుతామని మా వాళ్లు సరదా పడితే తప్పేంటని ప్రశ్నించారు.





















