Villagers search of Diamonds | కర్నూలు జిల్లా తుగ్గలిలో వజ్రాల కోసం వేట | ABP Desam
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలంలో వజ్రాల వేట ప్రారంభమైంది. ప్రతి సంవత్స రం తొలకరి వర్షాలు వచ్చే సమయంలో వజ్రాల కోసం ప్రజలు వేట కొనసాగిస్తారు. వర్షం పడిన తర్వాత భూమిలో ఉన్న వజ్రాలు బయటకు కనిపిస్తాయి. ఒక వజ్రం దొరికితే తమ తలరాతలు మారిపోతా యి అన్న లక్ష్యంతో అక్కడే ఉంటూ వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తుంటారు. ఎవరి జీవితం ఎప్పడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే కుబేరులైన వాళ్లు ఎందరో ఉన్నారు. కుబేరుడయ్యేంత స్థాయిలో కాకపోయినా ఎన్నో పంటలు పండించినా లభించనంత ఆదాయం చిన్నపాటి వజ్రం దొరకడంతో ఒక రైతుకు సమకూరింది. రాత్రికి రాత్రే లక్షల రూపాయలు లభించేంత అదృష్టం కర్నూలు జిల్లాలోని ఓ రైతును వరించింది.
రోజంతా వ్యవసాయం చేసే తన పొలంలో వజ్రం దొరకడంతో రాత్రికి రాత్రే ఆ రైతు ఆర్థిక కష్టాలు చాలా వరకు తొలగిపోయాయి. ఈ మధ్య కురిసిన వర్షాలకు రైతు పొలంలో ఆ వజ్రం బయటపడింది. రైతు రోజూ మాదిరిగానే పొలంలో పనులు చేసుకుంటుండగా, ఆ వజ్రం రైతు కంట పడింది. ఇంటికి తీసుకెళ్లి రైతు ఆ వజ్రాన్ని భద్రపరిచాడు. అయితే, రైతుకు వజ్రం దొరికిన విషయం పలువురు వ్యాపారులకు తెలియగా.. ఆయన ఇంటి వద్దకు క్యూ కట్టారు. ఎలాగైనా ఆ వజ్రాన్ని సొంతం చేసుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. వ్యాపారుల మధ్య పోటీ అధికంగా ఉండడంతో వజ్రాన్ని విక్రయించేందుకు వేలం పాట పెట్టారు. పెరవల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఈ వజ్రం కోసం ఐదు లక్షల నగదు, రెండు తులాల బంగారిన్ని ఇచ్చి దక్కించుకున్నాడు.